భాగవతం -: 5వ భాగం


ఇది పూర్తిచేయడానికి నీవు భాగవత రచన చెయ్యి’ అని ప్రబోధం చేశారు.

అపుడు వ్యాసభగవానుడు ఆనందమును పొందినవాడై ధ్యానమగ్నుడై ఆచమనం చేసి కూర్చుని భాగవతమును రచించడం ప్రారంభం చేశారు. ఇంత చేసిన తరువాత, ఏది చెయ్యడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో, ఏది అందించడం చేత తనజన్మ సార్ధకత పొందుతుందని అనుకున్నాడో, ఏది అందించిన తరువాత ఏది తెలుసుకున్న తరువాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో, కొన్ని కోట్ల జన్మలనుండి మనస్సు ఏది పట్టుకొనక పోవడం వలన అలా జరిగిందో, ఏది పట్టుకోవడం వలన మనుష్య జన్మకు సార్ధకత సిద్ధిస్తుందో అటువంటి మహౌషధమును మహానుభావుడు అందించడం ప్రారంభించారు.

అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు.అది సాక్షాత్తు ఉపనిషత్తుల సారాంశం. జ్ఞానం అంతా కూడా భాగవతమునందు నిక్షేపింపబడినది. దీనిని చెప్పడానికి శుకబ్రహ్మ మాత్రమే తగినవ్యక్తి. అందుకని తన కుమారుడయిన శుకబ్రహ్మకి భాగవతమును ప్రబోధం చేశారు.

ఆ భాగవతమును శుకబ్రహ్మ పరీక్షన్మహారాజుగారికి ఏడురోజులు చెప్పారు. ఎటువంటి పరిస్థితులలో చెప్పారు? భాగవతం చెప్పబడిన పరిస్థితిని మీరు విచారణ చేయాలి. చెప్పినది ఏడురోజులే! అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు. ఎందుకు ఏడురోజులు చెప్పవలసి వచ్చింది? భాగవతమును సప్తాహముగా చెప్పుకోవడం వెనుక ఒక రహస్యం ఉంది. ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి. – డెబ్బది సంవత్సరములు కాని, తొంబది సంవత్సరములు కాని లేక –

‘శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియః ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి’

నూరు సంవత్సరములు కాని పూర్ణంగా బ్రతకనివ్వండి – కాని ఎన్నిరోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే ఏడురోజులే బ్రతికినట్లు అని మనం తెలుసుకోవాలి. ఎందుచేత? ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని – ఇంతకన్నా ఇక రోజులు లేవు. ఎనిమిదవ రోజు యికలేదు. ఎప్పుడు మరణిస్తాడు? ఈ ఏడు రోజులలోనే మరణిస్తాడు. ఎంత గొప్పవాడయినా వాడు పోవడానికి ఎనిమిదవ రోజు ఉండదు. ఎవ్వరయినా ఆ ఏడురోజులలోనే వెళ్లిపోవాలి. ఆ ఏడూ రోజులలోనే పుట్టాలి. ఆ ఏడురోజులలోనే ఉండాలి. ఆ ఏడు రోజులలోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహము అంటే నీవు ఏరోజున భగవంతుణ్ణి స్మరించడం మానివేశావో ఆ రోజు పరమ అమంగళకరమయిన రోజు. ఆరోజు భగవంతుని యెడల విస్మృతి కలిగింది కాబట్టి తన భగవన్నామమును పలకలేదు. ఈశ్వరుడికి నమస్కరించలేదు. ఈశ్వరుని గురించిన తలంపు లేదు. ఆరోజున తను ఉంది మరణించిన వానితో సమానం. కాబట్టి ఆ రోజున ఇంట్లో ఏమి తిరిగింది? నడయాడిన ప్రేతము ఒకటి తిరిగింది. ఒక శవం ఆ ఇంట్లో నడిచింది. కాబట్టి ఆరోజు ఆ ఇల్లు అమంగళం అయింది. కాబట్టి ఏది బ్రతుకు? నిజమయిన బ్రతుకు ఏది? నిజమయిన బ్రతుకు ఈశ్వరుని నామస్మరణమే! భగవంతుని నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికివున్నవాడు. అయితే భగవంతుని నామము స్మరిద్దామంటే ఆ నామము అంత తేలికగా స్మరణకు వస్తుందా! ఆ వస్తువునందు నీకు ప్రీతి ఏర్పడితే నీమనస్సు భగవన్నామమును స్మరించడానికి అవరోధం ఉండదు . . . ✍

About The Author