లోకేష్ ని నమ్ముకుని గోదారి ఈదగలరా..?


ఈ ఎన్నికల్లోనే టీడీపీ సీఎం అభ్యర్థిగా లోకేష్ ని ముందుపెట్టి బరిలో దిగాల్సి ఉంది. కానీ ఆయన “వాక్చాతుర్యాని”కి చంద్రబాబు కూడా జడుసుకున్నారు. అందుకే సైలెంట్ గా పుత్రరత్నాన్ని పక్కనపెట్టి తానే సీఎంగా ప్రొజెక్ట్ చేసుకుని, మళ్లీ నువ్వే రావాలి లాంటి స్లోగన్లతో జనాల్లోకి వచ్చారు. ప్రస్తుతం పోలింగ్ పూర్తయింది, విజయం ఎవరిదో అందరికంటే బాగా చంద్రబాబుకే తెలిసొచ్చింది. ఆయన చలవతో టీడీపీ నేతలకు ఉన్న కాస్తో కూస్తో ఆశలు కూడా అడుగంటాయి. ఓడిపోతే ఏంచేయాలా అని ఇప్పటినుంచే దిగాలుగా కూర్చున్నారు పచ్చనేతలు.

చంద్రబాబు మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఏం మాట్లాడుతున్నారో తనకే తెలియట్లేదు, తన మాటల్లో తర్కం ఎంతుందో ఆయనకే అర్థంకావట్లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు మరో రెండేళ్లు కూడా యాక్టివ్ గా ఉంటారని అనుకోలేం. మరి అలాంటి సమయంలో టీడీపీ పరిస్థితి ఏంటి? చంద్రబాబుకి ప్రత్యామ్నాయమే లేకుండా ఉన్న ఆ పార్టీలో ఎవరిని నమ్ముకుని నేతలు, కార్యకర్తలు ముందుకు సాగాలి. ఎవరి నాయకత్వంలో టీడీపీ నడవాలి. రాగాపోగా ఆ పార్టీకి ఒకే ఒక్క దిక్కు లోకేష్ బాబే అనుకోవాలి.

పార్టీ తన కుటుంబం చేజారిపోకూడదని చంద్రబాబు ఎప్పుడో స్కెచ్ గీశారు. నందమూరి ఫ్యామిలీకి కూడా పార్టీ పగ్గాలు దక్కకూడదు అనుకునే రకం, అందుకే నిర్దాక్షిణ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కిపడేశారు. ఇప్పుడు కూడా లోకేష్ మినహా ఇంకెవరినీ పార్టీలో ఎదగనీయరు. అలాంటి పరిస్థితుల్లో నాయకులంతా లోకేష్ కి అండగా నిలబడతారా? ఆత్మాభిమానం లేని వాళ్లంతా లోకేష్ అడుగులకు మడుగులొత్తడానికే డిసైడ్ అయ్యారు.

కాస్తో కూస్తో తెలివితేటలున్నవాళ్లు, పార్టీ అండ కాకుండా తమకంటూ ప్రజాబలం ఉన్నవాళ్లు టీడీపీ నుంచి బైటకొచ్చేయడం ఖాయం. జగన్ పాలనను ఎదుర్కుని వచ్చే ఎన్నికల వరకు పార్టీని కాపాడుకోవాలంటే అది లోకేష్ తరంకాదు. మరి చినబాబును నమ్ముకుని ఎంతమంది, ఎంతకాలం తెలుగుదేశం జెండాని భుజాన మోస్తారో చూడాలి.

About The Author