సార్వత్రిక ఎన్నికలపై జేసి దివాకర్ రెడ్డి కామెంట్స్…

అమరావతి: టీడీపీ గెలుపుపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు అదృష్టవంతుడు. ఎందుకని ఆయన నన్ను అడిగారు. డ్వాక్రా మహిళలకు చెక్కులు సరైన సమయంలో వేయడమే అదృష్టానికి కారణం. నిన్న క్యూలో అమ్మవార్లు, వృద్ధులు విరగబడి వచ్చారు. చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలపడానికే వాళ్లు వచ్చారు. అనంతపురం లోక్‌సభలో అందరినీ మార్చమని నేనే చెప్పా. మార్చకపోతే గెలవం అని చెప్పాను. అయినా మార్చలేదు. మార్చకపోయినా గెలుస్తున్నారంటే అమ్మవార్ల దయే. అనంతపురం టౌన్‌, శింగనమల, గుంతకల్లు కూడా గెలవబోతున్నాం. రాసిపెట్టుకోండి.. మే 23వ తేదీన చూడండి’’ అంటూ జేసీ దివాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు అదృష్టం.. సుడి తిరిగినట్లు తిరిగిందని జేసీ కొనియాడారు. ఈవీఎంలు మధ్యాహ్నానికే పనిచేశాయని, సహజంగా క్యూలో ఉండే మహిళలు ఒక్కసారి ఇంటికి వెళ్తే తిరిగిరారు.. కానీ చంద్రబాబు పిలుపుతో ఆయనకు కృతజ్ఞతతోనే మళ్లీ వచ్చి ఓటేశారని ఆయన తెలిపారు. అదృష్టమేగానీ.. తన కృషి లేదా అని చంద్రబాబు అడిగారని, కృషి ఉంటేనే అదృష్టం ఉంటుందని చెప్పానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సైలెంట్‌ వేవ్‌ మహిళల్లో ఉందని, అందుకే అర్థరాత్రి దాకా ఓట్లు వేశారని జేసీ పేర్కొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మరపురాని సన్నివేశమని చెప్పారు. ఇప్పుడున్న వేవ్‌లో 5 వేల ఓట్లతో గెలుపు.. గెలుపే కాదని ఆయన వ్యాఖ్యానించారు.

రెడ్డి అనే ఫీలింగ్‌ చాలా ఎక్కువగా కనిపించిందని, రాష్ట్రంలో ఉన్న రెడ్లు మెజార్టీ శాతం జగన్‌కే ఓటేశారని తెలిపారు. కానీ ఈ వేవ్‌లో అదంతా కొట్టుకుపోయిందన్నారు. మొన్న రాత్రి వరకు అనంతపురం, శింగనమల, గుంతకల్లు పోతాయనుకున్నానని, నిన్న ఉదయం క్యూలో అమ్మవార్లను చూశాక.. లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక లెక్క.. ఇప్పుడు జరిగిన ఎన్నికలు ఇంకో లెక్క అని దివాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

About The Author