జైన సేవా సంఘం భగవాన్ మహవీర్ జయంతి ఉత్సవాల్లో శ్రీ వెంకయ్య నాయుడు గారు…


సత్య మార్గంలో సహనంగా ముందుకు సాగాలని ప్రవచించిన భగవాన్ మహావీరుని జీవితాన్ని సమకాలీన ప్రపంచం ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన బోధించిన శాంతి, అహింస మార్గంలో ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జైన సేవా సంఘం నిర్వహించిన భగవాన్ మహవీర్ జయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎదురౌతున్న అనేక ప్రశ్నలకు జైన తత్త్వంలో సమాధానాలు దొరుకుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
సత్యం, అహింస, సర్వజీవుల పట్ల కరుణ లాంటి భగవాన్ మహావీరుని సందేశాలు సత్యమార్గంలో ప్రకాశించాయని, వారి బోధనలు కేవలం ఆధ్యాత్మిక మార్గంలో మాత్రమే గాక, నైతిక ధర్మానికి చుక్కానిగా నిలుస్తాయని, సమస్త మానవాళి శాంతి, సౌభాగ్యం దిశగా ప్రతి ఒక్కరినీ ఉత్తేజితం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ భూమి మీద నడయాడిన ఉన్నతమైన ఆధ్యాత్మిక గురు పరంపరలో భగవాన్ మహావీరుడు కూడా ఒకరని అన్నారు. జైన ధర్మం భారత ఆధ్యాత్మిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్న ఉపరాష్ట్రపతి, భారతదేశ మూలభావనలైన సత్యం, అహింస, శాంతి మార్గాలను ముందుకు తీసుకుపోవడానికి జైనమతం కృషి చేసిందన్నారు.
భారతదేశ సనాతన నాగరికత గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రేమ, శాంతి, సహనం, సోదర భావాలతో ఒకప్పుడు ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహించిందని, అత్యున్నత విజ్ఞాన ఖనిగా భాసిల్లిన మన దేశం ప్రపంచానికి విశ్వగురు స్థానం వహించిందని, దీన్ని తిరిగి నిలబెట్టుకోవలసిన అవసరం ఉందని తెలిపారు.
ప్రస్తుతం ఉగ్రవాదం సహా అనేక కోణాల్లో భారతదేశం హింసా కాండతో పోరాడుతోందని, దీనికి వ్యతిరేకంగా ముందుకు సాగేందుకు జైన సిద్ధాంతాలైన శాంతి, అహింసలు సమాజానికి దోహదం చేస్తాయని, ఇది భారత స్వరాజ్య సంగ్రామమే ఉదాహరణ అని ఉపరాష్ట్రపతి తెలిపారు. అదే సమయంలో ప్రకృతి ప్రసాదించిన వనరుల వాడకం విషయంలోనూ సమాజం దృష్టికోణం మారాల్సి ఉందన్న ఆయన, ఈ నేపథ్యంలో మన జీవన విధానాన్ని మార్చుకోవాలని, ప్రకృతి మనకు ప్రసాదించిన వనరులను యథాతథంగా భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జైన సేవా సంఘం అధ్యక్షుడు శ్రీ వినోక్ కిమ్టీ, ప్రధాన కార్యదర్శి శ్రీ యోగేష్ సింఘి తదితరులు పాల్గొన్నారు.

About The Author