ఏప్రిల్ 18న ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు…


ఏప్రిల్ 18న ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 18వ తేదీ గురువారం శ్రీ సీతారాముల కల్యాణాన్ని రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు వైభవంగా నిర్వహించేందుకు టిటిడి, జిల్లా యంత్రాగంతో క‌లిసి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా

భ‌క్తుల కోసం క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద‌ గ్యాల‌రీలు….

శ్రీ సీతారాముల క‌ల్యాణాన్ని వీక్షించేందుకు వ‌చ్చే భ‌క్తుల కోసం క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టారు. భ‌క్తులు కూర్చునేందుకు వీలుగా ప్ర‌త్యేకంగా గ్యాల‌రీలు ఏర్పాటు చేశారు. ఆక‌ట్టుకునేలా వేదిక ముఖ‌ద్వారాన్ని రూపొందించారు. మొత్తం మూడు ద్వారాలుండ‌గా, మ‌ధ్య ద్వారాన్ని శ్రీ సీతారాముల ఉత్స‌వ‌ర్ల‌కు ఎదుర్కోలు ఉత్స‌వం నిర్వ‌హించేందుకు కేటాయించారు. రెండు చివ‌ర్ల ఉన్న ద్వారాల వ‌ద్ద‌ భ‌క్తులను అనుమ‌తిస్తారు.

జ‌ర్మ‌న్ షెడ్లు  :

దాదాపు ల‌క్ష మంది భ‌క్తులు పండువెన్నెల‌లో కూర్చుని క‌ల్యాణాన్ని తిల‌కించేందుకు టిటిడి ఏర్పాట్లు చేసింది. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని ప‌టిష్టంగా జ‌ర్మ‌న్ షెడ్లు, భ‌క్త‌లు కుర్చునేందుకు వీలుగా కార్పెట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా  ప్రముఖులు కూర్చునేందుకు కల్యాణవేదిక పక్కన వేదిక రూపొందించారు. వ్యక్తులను నిలువరించేందుకు వీలుగా బ్యారికేడ్ ఏర్పాటు చేశారు.

భూలోక నందనవనంగా రాములవారి కల్యాణవేదిక  :

శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఒంటిమిట్టలో  ఏర్పాటుచేస్తున్న‌ కల్యాణవేదికను అత్యంత సుంద‌రంగా భూలోక‌ నందనవనాన్ని తలపించేలా టిటిడి ఉద్యానవన విభాగం అధ్వార్యంలో బెంగళూరుకు చెందిన అలంకరణ నిపుణులు, టిటిడి సిబ్బంది కలిపి దాదాపు 50 మంది ఇందుకోసం పనిచేస్తున్నారు.

ఇందులో చెరుకులు, టెంకాయపూత, అర‌టి ఆకులు, మామిడాకులు, మామిడికాయలు, ఆఫ్రికన్‌ ఆరంజ్‌, గ్రీన్‌ ఆపిల్‌, రెడ్‌ ఆపిల్‌, నలుపు, ఆకుపచ్చ ద్రాక్ష, దోస, మొక్కజొన్న తదితర ఫలాలు, సంప్రదాయపుష్పాలు, నీలం ఆర్కిడ్‌, రెడ్‌ ఆంథూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో కల్యాణవేదికను అలంకరించ‌నున్నారు.

భక్తులకు అన్నప్రసాదాలు :

స్వామివారి క‌ల్యాణానికి విచ్చేసే భక్తులకు క‌ల్యాణ వేదికకు కుడి వైపు 75, ఎడ‌మ వైపు 75 ప్రసాద వితరణ కౌంటర్లు ఏర్పాటు చేశారు.

ఇందులో అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మ‌జ్జిగ‌, అక్షింత‌లు అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. అదేవిధంగా ఆల‌యం వ‌ద్ద‌ ప్ర‌తి రోజు ఉద‌యం 11.00 నుండి రాత్రి 10.00 గంట‌ల వ‌ర‌కు సాంబార‌న్నం, పెరుగ‌న్నం పంపిణీ చేస్తున్నారు.

విద్యుద్దీపాలంకరణలు :

ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా ఏర్పాటుచేసిన విద్యుద్దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కల్యాణవేదిక ప్రాంగణంలో 20 ఎల్‌ఇడి స్క్రీన్లు, లేజర్‌ లైట్లు ఏర్పాటుచేశారు. ఆలయం, కల్యాణవేదిక ప్రాంతాల్లో శ్రీరామపట్టాభిషేకం, సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు, రామాయణంలోని ఘట్టాలు, శ్రీ మ‌హావిష్ణు విశ్వ‌రూపం తదితర విద్యుత్‌ దీపాల కటౌట్లను అద్భుతంగా తీర్చిదిద్దారు.

శ్రీ‌వారిసేవకులు  :

దాదాపు 1200 మంది శ్రీ‌వారి సేవ‌కులు, 500 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భ‌క్తుల‌కు సేవ‌లందించ‌నున్నారు. శ్రీ సీతారాముల కల్యాణంలో పాల్గొనే  భక్తులందరికీ ముత్యంతో కూడిన తలంబ్రాల ప్యాకెట్‌ భ‌క్తుల‌కు అందించేందుకు  దాద‌పు 500 మంది శ్రీ‌వారిసేవ‌కులు 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేశారు.

ఆరోగ్య విభాగం   :

కల్యాణవేదిక వద్ద భక్తులందరికీ అందుబాటులో 6 ల‌క్ష‌ల తాగునీటి ప్యాకెట్లు, 2 ల‌క్ష‌ల మ‌జ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. దాదాపు 300 తాత్కాలిక, మొబైల్‌, శాశ్వ‌త మరుగుదొడ్లు, నీటి వసతిని టిటిడి,  జిల్లా ఆరోగ్య విభాగంతో క‌లిసి ఏర్పాటు చేశారు. మెరుగైన పారిశుద్ధ్యం కోసం దాదాపు 450 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియ‌మించారు.

వైద్యసేవలు   :

కల్యాణవేదికకు నాలుగువైపులా వైద్యశిబిరాలు ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు పారామెడికల్‌ సిబ్బంది, మందులు, అంబులెన్సు టిటిడి వైద్య విభాగం, జిల్లా వైద్య విభాగాలు స‌మ‌న్వ‌యంతో ఏర్పాటు చేశారు.

భ‌ద్ర‌త విభాగం   :

జిల్లా ఎస్‌పితో సమన్వయం చేసుకుని సిసి కెమెరాల ఏర్పాటుతోపాటు 2 వేల మంది పోలీసులు, టిటిడి విజిలెన్స్ సిబ్బందితో  బందోబస్తు ఏర్పాటుచేశారు.  భక్తులకు సమాచారం, సూచనలిచ్చేందుకు రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు ప్రకటనలిచ్చే ఏర్పాటు చేశారు. శ్రీకోదండరామాలయం వద్ద, చెరువు కట్ట వద్ద, కల్యాణవేదిక పక్కన వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.

శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం  :

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు  శ్రీ సీతారాముల కల్యాణం  వీక్షించేందుకు శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఆధ్వర్యంలో  ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు :

ఏప్రిల్ 18న కల్యాణోత్సవం సందర్భంగా సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీమతి ద్వారం విజ‌య‌ల‌క్ష్మీ బృందం,  సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు చెన్నైకు చెందిన శ్రీ ఎం.రాము బృందం గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ దీవి హయగ్రీవాచార్యులు, శ్రీ చ‌క్ర‌వ‌ర్తుల రంగ‌నాథం, శ్రీ పి.గౌరిశంక‌ర్‌ కల్యాణోత్సవానికి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తారు.

About The Author