శ్రీకృష్ణుని చిటికెన వేలిమీద వారం రోజులు నిలచిన గోవర్ధనగిరి ఎవరు?
మన పురాణాల ప్రకారం ప్రతీ పదార్ధం బ్రహ్మమయం. వాటిలో చైతన్యం ఉందని చెబుతుంది. ఇప్పటికి నేటి సాంకేతిక పరంగా కొంత నిరూపణ అయింది. మొక్కలలో జీవం ఉందని జగదీశ్ చంద్రబోస్ దాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తరువాత అందరూ నమ్మడం మొదలుపెట్టారు. కానీ ఈ విషయం మనకు మన వాంగ్మయం ఎన్నో ఉదాహరణలతో చెబుతుంది. అందిపుచ్చుకునే స్థాయికి ఇంకా మనం చేరలేదు. ఇదే విధంగా ప్రతీ గిరి, కొండ కూడా చైతన్య పరిపూర్ణంగా చెబుతారు. ఉదాహరణకు మన వేంకటాచలం, భద్రుడు/భద్రగిరి, వింధ్యాచలం, హిమవంతుడు, మైనాకుడు ఇలా ఎన్నో గిరులు ఎంతో తపించి తమ జన్మసార్ధకం చేసుకున్నాయి. ఇదే విధంగా గోవర్ధనగిరి కూడా కారణజన్ముడే. స్థూలంగా వారి రూపం వేరున్నా సూక్ష్మంగా వారి స్వరూపం వేరుగా ఉంటుంది. వాటి కర్మల ఫలంగా అవి కూడా పూజలను అందుకునేవి కొన్నయితే తొలచబడి పిండి చెయ్యబడేవి కొన్ని. వాటి ఎదుగు తరుగు కూడా ఉంటూ ఉంటాయి. ఇది సాంకేతికంగా నిరూపింపబడినదే. ఉదాహరణకు హిమాలయాల కొండలు సంవత్సరానికి 2 ఇంచుల పొడుగు పెరుగుతుంటుంది అని శాస్త్రవేత్తలు అందరూ ఒప్పుకునే నిజం.
భారతవర్షమునకు పశ్చిమదిశలో ఉన్న శాల్మలీద్వీపంలో ద్రోణాచలానికి గోవర్ధనుడు జన్మించాడు. ఎలాగైతే వైకుంఠలోకం నుండి వచ్చిన క్రీడాచలం వెంకటాచలం అయినదో అలాగే ఈ గోవర్ధనుడు గోలోకం నుండి భూలోకంలో స్వామికోసం వచ్చాడు. ఆ గిరిరాజు పుట్టగానే హిమవంతుడు, సుమేరులు వచ్చి అతడిని ఆశీర్వదించి పూజించి ఆ గిరిరాజ నామం ఇచ్చి వెళ్తారు. ఒకనాడు పులస్త్యుడు తీర్దాటన చేసుకుంటూ ఆ ద్వీపంలో ఈ శ్యామల వర్ణంతో, ఓషధులతో, లతలతో, సెలయేళ్ళతో అలరారుతున్న ఈ అందమైన గిరిని చూసి ముచ్చటపడి ఈ పర్వతం శాంతిధామంగా తపస్సులకు అనుకూలంగా ఉంటుందన్న సదుద్దేశంతో ఆ గిరిరాజు తండ్రి ద్రోణుని ఇతడిని పూజనీయుని చేస్తాను కాశీలో విశ్వేశరుని వద్దకు తీసుకువెళ్తానని అక్కడ ఈ గిరిమీద తపస్సు చేసుకోవాలనే కోరిక కలిగింది కనుక ఇవ్వమని కోరతాడు.
ఎంతో మధన పడి, పులస్త్య బ్రహ్మ కోపానికి భయపడి ద్రోణుడు తన కుమారుడైన గోవర్దునుని వదలడానికి ఒప్పుకుంటాడు, కొడుకును ఒప్పిస్తాడు. కానీ గోవర్ధనుడు ఒక షరతు మీద పులస్త్యుని చేతిలో ఉండి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అదేమిటంటే ఎక్కడా కూడా అతడిని దించరాదని, ఎక్కడ దించితే అక్కడ తాను ప్రతిష్టుడిని అవుతానని ఆ షరతు మీద వస్తానని ఒప్పుకుంటాడు. సంతోషించి పులస్త్యుడు గోవర్ధనుని అరచేతిలో పెట్టుకు తీసుకువెళ్తుంటాడు. బృందావనం మీదనుండి వెళ్తుండగా ఆ ప్రదేశమే కదా పరాత్పరుడు అయిన గోలోకాధిపతి వచ్చి ఉండేది అని భావించి తన బరువు పెంచడం మొదలుపెడతాడు గోవర్ధనుడు. అలసటకు పులస్త్య బ్రహ్మ అక్కడ దించి కొంతసేపు సేద తీర్చుకుని మరల తీద్దామంటే తమ ఒడంబడిక ప్రకారం కదలనని గోవర్ధనుడు మొరాయిస్తాడు. దానికి మొత్తం విషయం గ్రహించిన ఆయన సంవత్సరం నువ్వు గింజంత ప్రమాణం తరిగిపో అని శపించి వెళ్ళిపోతాడు.
శ్రీకృష్ణుడు ఆ బృందావనం వాసులందరి చేత ఆ గోవర్ధన గిరికి పూజ చేయించి అతడిని ఏడు రోజులు తన చిటికెన వేలు మీద నిలిపి అనుగ్రహించాడు. స్వామి వారి అవతారంలో ఆయన పాదానికి అంటుకున్న ధూళి కూడా ఎంతో పుణ్యం చేసుకున్న యోగుల అవతారాలే. నేటికి కూడా తిరుమల గిరి అంతా సాలగ్రామ మయం అని అక్కడున్న చెట్టు పుట్టలు కూడా తపస్సు చేసుకుంటున్న మహర్షులే అని యోగులు చెబుతారు.