సర్కారు బడులకు క్యూ.. సీట్ల కోసం పోటీ…
సర్కార్ బడుల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు సరిపడ ఉపాధ్యాయులను నియమించి, నాణ్యమైన భోజనం, హెల్త్ కిట్స్ అందజేస్తూ కార్పొరేట్‌కు ధీటుగా చదువులు చెప్పుతుండడంతో ప్రభుత్వ బడుల్లో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ప్రతి పేద వాడికి కార్పొరేట్ కంటే మించి నాణ్యమైన విద్య అందజేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మెరుగైన ఫలితాన్ని ఇవ్వడంతో విజయవంతంగా ముందుకు సాగుతున్నది. నాడు అరకొర విద్యార్థులతో తీసివేసే పరిస్థితికి వచ్చిన ప్రభుత్వ పాఠశాలలు నేడు అడ్మిషన్స్ ఫుల్ అనే పరిస్థితికి వచ్చాయి.
శిథిల గదులు.. ముక్కిపోయిన దొడ్డు బియ్యం.. నీళ్ల చారు.. పురుగుల అన్నం.. ఇదంతా ఉమ్మడి పాలకుల పాలనలో తరచూ ప్రభుత్వ బడుల్లో విన్పించే మాటలు. రోజుకో చోట ఇలాంటి వాటిపై ఆందోళనలు. కార్పొరేట్ కబంధ హస్తాల్లో బందీలుగా మారిన పాలకులు.. ప్రభుత్వ విద్యను నీరుగార్చారు. వీటన్నింటినీ నిశితంగా పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన కొన్నాళ్లలోనే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టింది. నేను పోను అయ్యో.. సర్కారు బడికి అన్న మాట నుంచి తెలంగాణ ప్రభుత్వ పాలనలో సర్కారు బడుల్లో సీట్ల కోసం పోటీ పడే పరిస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఎంతగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
ఇదంతా ఒకటీ.. అర.. స్కూళ్లల్లో కాదు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లో ఎక్కడ చూసినా సర్కారు బడుల్లో ప్రవేశాల కోసం క్యూ కడుతున్నారు.. ఉమ్మడి పాలకుల కాలంలో ప్రభుత్వ బడులు ఎప్పుడూ కూలుతాయో.. తెలియక బిక్కు బిక్కుమంటూ ఓవైపు ఉపాధ్యాయులు.. మరోవైపు విద్యార్థులు కాలం వెళ్లదీసేవారు. కొంతమంది స్వార్థపరులు విద్య మాటున చేస్త్తున్న వ్యాపారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నియంత్రించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన కేజీ టూ పీజీ విద్యలో భాగంగా ప్రభుత్వ విద్యా రంగాన్ని పూర్తి స్థాయిలో బలపరిచారు. ఒక్క గురుకుల విద్యాలయాల్లోనే కాకుండా మారుమూల పల్లెల్లోనీ ప్రభుత్వ బడులను సైతం ఆదరించి అదనపు తరగతులను నిర్మించడంతో పాటు సరిపడా బోధన సిబ్బందిని నియమించడం ద్వారా విద్యా ప్రమాణలు మెరుగయ్యాయి.
రాజ్‌భవన్ స్కూల్ ప్రత్యేకం..
సోమాజిగూడ రాజ్‌భవన్ క్వార్టర్స్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం ఒకప్పుడు శిథిలావస్థలో ఉండేది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. దీంతో భవనాన్ని ఖాళీ చేసి బడిని మక్తాకు తరలించారు. తర్వాత రూ.4.5 కోట్లు ఖర్చు చేసి 30 గదులతో మూడంతస్తుల భవనాన్ని నిర్మించారు. జూన్ 14, 2017లో గవర్నర్ నరసింహన్, అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ తరగతులు, ఈ-లైబ్రరీలు, విశాలమైన తరగతి గదులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఆరుగురు ఉపాధ్యాయులు, 10 మంది విద్యా వలంటీర్లు పనిచేస్తున్నారు. ఈ బడిలో సోమాజిగూడ, ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తాలోని ప్రైవేట్ స్కూళ్ల నుంచి భారీగా విద్యార్థులు చేరారు.
బర్కత్‌పుర, కాచిగూడ, నారాయణగూడ, కవాడిగూడ వంటి దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు రావడం గమనార్హం. అప్పట్లో రాజ్‌భవన్ స్కూల్‌లో 196 మంది మాత్రమే ఉండేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ బడిలో తీసుకొచ్చిన వసతుల కారణంగా కొత్తగా 525 మంది చేరారు. ఒక్క ప్రాథమిక పాఠశాలలోనే ప్రస్తుతం దాదాపు 730 మంది విద్యార్థులు ఉన్నారు. దానిపక్కనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనూ విద్యార్థులు గణనీయంగా చేరారు. ఇందులో ప్రవేశాల కోసం పెద్ద ఎత్తున సిఫారసులకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తుండడం గమనార్హం.
బాలికల ఆరోగ్య సంరక్షణకు హెల్త్ కిట్స్..
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో చదివే బాలికల సంరక్షణ కోసం హెల్త్ అండ్ హైజీన్ కిట్స్‌ను ఉచితంగా అందజేస్తున్నది. ఈ కిట్‌లో 14 రకాల వస్తువులను విద్యార్థినులకు సరఫరా చేస్తున్నది. అందులో పతంజలి కంపెనీకి చెందిన మూడు సబ్బులు, 3 డిటర్జెంట్లు, 150 ఎంఎల్ డాబర్ సాం పు బాటిల్, 175 ఎంఎల్ డాబర్ కొబ్బరినూనె, 50 గ్రాముల ఐటెక్స్ ఫ్యాన్సీ ఫౌడర్, 100 గ్రాముల డాబర్ టూత్ పేస్ట్, పతంజలి టూత్ బ్రెష్, టంగ్ క్లీనర్, దువ్వెన, ఐటెక్స్ స్టిక్కర్స్(బొట్టు బిల్లలు), రిబ్బన్లు, ఫ్యాబ్రిక్ ఎలాస్టిక్స్, 180 ఎంఎల్ హ్యాండ్ వాష్ ఆయిల్ ఉంటాయి. ఒక్కో కిట్ రూ.1600 విలువు ఉంటుంది. ఇలా యేటా మూడు కిట్లను అమ్మాయిలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది.
రుచికరమైన మధ్యాహ్న భోజనం..
ఉత్తమమైన బోధనతో పాటు రుచికరమైన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న విద్యార్థులను గమనించిన సీఎం కేసీఆర్.. ప్రత్యేక మెనూలో వారి ఆరోగ్యంలో మార్పులు తీసుకొచ్చారు. సోమవారం భోజనంతో పాటు ఉడకబెట్టిన గుడ్డు, సాంబార్, మంగళవారం కూరగాయలతో భోజనం, బుధవారం పప్పుకూరలు, కోడిగుడ్డు, గురువారం సాంబార్, పప్పు, శుక్రవారం గుడ్డు, సాంబార్, శనివారం పప్పు, కూరగాయలతో భోజనం పెడుతున్నారు. ఒక్కో విద్యార్థికి కూరగాయల కోసం రోజుకు రూ.4.13 పైసలతో పాటు 100 గ్రాముల బియ్యాన్ని సరఫరా చేస్తుంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రూ.6.18తో పాటు 150 గ్రాముల బియ్యాన్ని అందిస్తున్నది.
ప్రభుత్వ బడుల్లో విద్య భేష్..
ఉమ్మడి పాలకుల కాలంతో పోల్చుకుంటే.. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ విద్య అగ్రభాగాన ఉంది. ప్రభుత్వ బడుల్లో వసతులు ఎంతో మెరుగయ్యాయి. ఒక్క బడుల్లోనే కాకుండా జూనియర్, డిగ్రీ కాలేజీల్లోనూ ప్రభుత్వం మెరుగైన వసతులతో పాటు బోధకుల నియామకాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపర్చారు. విద్యారంగంలో పాలనపరమైన అంశాల్లోనూ సంస్కరణలు తీసుకొచ్చారు. రాబోయే ఐదేండ్లలో విద్య విషయంలో తెలంగాణ అగ్రభాగానికి చేరుకుంటుంది.
-శ్రీపతి సురేశ్‌బాబు, కాంట్రాక్ట్ లెక్చరర్