సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ పై లైంగిక ఆరోపణలు….
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు చాలా తీవ్రమైన ముప్పు ఎదురవుతోంది…. తన పై వచ్చిన ఫిర్యాదు వెనక న్యాయవ్యవస్థను అస్థిరపరిచే భారీ కుట్ర ఉంది … రంజన్ గొగోయ్
శనివారం సెలవు రోజైనప్పటికీ ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ల త్రిసభ్య ధర్మాసనం పరిశీలన జరిపిందని సీనియర్ జర్నలిస్టు సుఫా మొహంతి పేర్కొన్నారు..
ఈ ఫిర్యాదు చేసిన మహిళ వెనక ఓ బలమైన శక్తి ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయమూర్తులు పనిచేయాల్సి వస్తే, మంచివారెవరూ ఈ బాధ్యతలను చేపట్టరని జస్టిస్ గొగోయ్ చెప్పారు.
ఈ అంశం దేశ ప్రజానీకానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయమని, అందువల్ల దీనిపై విచారణ జరపాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శనివారం సుప్రీంకోర్టులో పేర్కొన్నారు.
అయితే… ఈ ఫిర్యాదుపై ధర్మాసనం ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వునూ జారీచేయలేదు.
న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు, ఈ నిరాధార ఆరోపణలపై వార్తలు అందించే విషయంలో సంయమనం పాటించాలని మీడియాకు జస్టిస్ గొగోయ్ సూచించారు.
జస్టిస్ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తర్వాత తనను, తన భర్తను, ఇతర కుటుంబ సభ్యులను బాధితులుగా మార్చారని సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని తన ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ ఆరోపణలతో మొత్తం 22 మంది సుప్రీంకోర్టు జడ్జిలకు ఏప్రిల్ 19 న ఆమె లేఖ రాశారు.