శ్రీ రఘునాయకస్వామిఆలయం…చదలవాడ…
ఈ ఆలయం మనదేశంలో దక్షిణ భాగాన వున్న హిందూ ఆలయాల్లో శ్రీరామునికి కుడివైపున సీతాదేవి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడంతో శ్రీరఘునాయకస్వామి ఆలయం ప్రాచుర్యం పొందింది. సహజంగా స్వామి వారికి ఎడమవైపున సీతాదేవి వుండటం చూస్తుంటాం. కానీ అందుకు విరుద్ధంగా ఈచతుర్వాటికలో అగస్త్యముని విగ్రహాలను ప్రతిష్ఠించారు.
పూర్వాపరాలను ఒక్కసారి పరికించి చూసినట్లయితే ప్రకాశంజిల్లాలోని నాగులుప్పలపాడు మండలకేంద్రానికి కూతవేటు దూరంలో దక్షిణవైపు వున్న చదలవాడ గ్రామం ఒకప్పుడు చతుర్వాటికగా ప్రసిద్ధికెక్కింది. అయితే త్రేతాయుగంలో సీతాదేవిని రావణుడు అపహరించిన నేపథ్యంలో ఆమెను వెదుకుతూ ఈప్రాంతానికి వచ్చి శ్వేతగిరి అని పిలవబడే ప్రస్తుతం ఆలయం నిర్మింపబడిన స్ధలంలో తపస్సు చేసుకోవడానికి కూర్చొన్నారని అప్పుడు వామభాగాన (ఎడమవైపు)లక్ష్మణుడు వున్నాడని పురాణోక్తి. అందుకే అగస్త్యముని అమ్మవారిని కుడివైపున వుండేలా తరువాత విగ్రహ ప్రతిష్ఠ చేసారని ఆర్యోక్తి. అలాగే సుగ్రీవుని ఆజ్ఞమేరకు వానరసైన్యం సీతాదేవిని వెదకడానికి ఇక్కడినుండే నలుదిక్కులు వెళ్ళారని అందుకే ఈగ్రామం చతుర్వాటికగా పేరొందిందని ప్రతీతి. ఈఆలయానికి ఐదు ప్రాంతాలను శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే నిర్మించేందుకు సంకల్పించారని,తరువాతి కాలంలో ఇక్కడ గోల్కొండ నవాబుల కాలంలో వారి మంత్రులు అక్కన్న,మాదన్నల పర్యవేక్షణలో ఉత్సవాలు జరిగినట్లు శాసనాలద్వారా తెలుస్తుంది. అద్దంకి సీమ నేలిన రెడ్డిరాజులు కూడా ఈ ఆలయ నిర్వహణలో భాగం పంచుకున్నట్లు తెలుస్తోంది. కవిత్రయంలోని ఎర్రన కూడా తనభారత అరణ్య పర్వశేషభాగాన్ని ఇక్కడే తెనుగించాడని చారిత్రక ఆధారాలున్నాయి. ఇంతటి మహత్తరమైన ఆలయ ప్రతిష్ఠకోసం అగస్త్యముని నారదుని ప్రేరణచే బ్రహ్మ కమండలంలోని జలాన్ని తెచ్చాడని అది బ్రహ్మకుండిగా నదిగా ప్రసిద్ధి చెంది తదుపరి గుండ్లకమ్మ నదిగా మారిందని తొలుత ఇది ఆలయ ప్రదక్షిణలా ఉత్తరం వైపునుండి దక్షిణం వైపుకు తర్వాత తూర్పునకు ప్రవహించినట్లు ఆ తర్వాత ఎడంగా ప్రవహిస్తున్నట్లు ఆర్యోక్తి. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయంలోని స్వామివారికి తిరునాళ్ళు త్రేతాయుగం నుండి శ్రీరామనవమి నుండి తొమ్మిదిరోజులపాటు జరిగి చివరిరోజున స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామివారికి తలంబ్రాలు భద్రాచలం నుండి ఇక్కడికి వస్తాయి. ఈ ఘట్టం రోజే ఉదయం 7 గంటలనుండి ప్రారంభమయ్యే కళ్యాణానికి భక్తులు చుట్టుప్రక్కల గ్రామాలనుంచేగాక సుదూర ప్రాంతాలనుండి ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తారు. ఇంకొక విశేషం ఏమిటంటే తలంబ్రాలు పోయడానికి ముందు ఆకాశ మార్గంలో గరుడపక్షి వచ్చి మూడుసార్లు స్వామివారి కళ్యాణమండపంపై ప్రదక్షిణ చేసిన అనంతరం తలంబ్రాలను పోస్తారు.దీంతో వేలాదిమంది భక్తులు అనాదినుండి గరుడపక్షి ఎప్పుడు వస్తుందా అని ఆకాశ మార్గం వైపు ఎదురుచూస్తూ వుంటారు. అనంతరం సాయంత్రం 4గంటలకు రథోత్సవ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రథాన్ని లాగడానికి భక్తులు,యువత ఎక్కువసంఖ్యలో పాల్గొని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్ళి మళ్ళీ యదాస్థానానికి చేరుకొంటారు. చదలవాడ గ్రామంలో తొమ్మిదిరోజులపాటు పండుగ వాతావరణంలా వుంటుంది. ప్రతి ఇంటిలో తమతమ బంధువులతో ఇళ్లన్నీ కళకళలాడుతూ కనిపిస్తాయి.