మోదీకి ప్రకాశం జిల్లా వాసుల ఝలక్….
సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు వినూత్న మార్గాన్ని ఎంచుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలుస్తూ తమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు అవశ్యకతను చాటిచెప్పుతూ ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ బరిలో నిలుస్తున్న వారాణాసి లోక్సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే.. పామూరు మండలం బొట్లగూడూరు గ్రామానికి చెందిన వడ్డే శ్రీనివాసులు, కొల్లూరు రవికిరణ్ శర్మలు శుక్రవారం వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. వీరికి మద్దతు తెలిపేందుకు పలువురు స్థానికులు కూడా వారణాసికి వెళ్లారు.
ఈ సందర్భంగా కాళభైరవ ఆలయం వద్ద వెలిగొండ పోరాట సాధన సమితి సభ్యులు నిరసన తెలిపారు. కనిగిరి ప్రాంతంలోని ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కలగాలంటే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి తీరాలన్నారు. ఈ సమస్యను జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు వారణాసి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశామని పేర్కొన్నారు.
మరోవైపు మోదీపై పోటీ చేయడానికి సిద్దమైన నిజామాబాద్ పసుపు రైతులు కూడా గురువారం వారణాసి బయలుదేరి వెళ్లారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా పోటీలో ఉంటామని నిజామాబాద్ రైతులు పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి భారీ సంఖ్యలో రైతులు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎంపీ కవిత బరిలో నిలిచిన నిజామాబాద్ స్థానం నుంచి మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో అక్కడ ఎన్నిక నిర్వహించడం ఎన్నికల సంఘానికి ఇబ్బందికరంగా మారింది.