నరేంద్ర మోదీని, నన్ను టార్చర్‌ చేశారు..”


ప్రధాని నరేంద్ర మోదీని, తనను కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం తీవ్ర వేధింపులకు గురిచేసిందని భోపాల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞా సింగ్‌ ఠాకూర్‌ ఆరోపించారు.

ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కాంగ్రెస్‌ ఎంచుకున్న హింసకు తాను, మోదీ గుర్తులమని వ్యాఖ్యానించారు.

దేశ భక్తులను ఉగ్రవాదులుగా ముద్రవేసే కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

దేశభక్తులను చూస్తే వణికిపోయే కాంగ్రెస్‌కు మరోసారి పరాజయం తప్పదని జోస్యం చెప్పారు.

కాగా చేయని తప్పులకు తమను బాధ్యులిగా చూపి కాంగ్రెస్‌ అవాస్తవాలు ప్రచారం చేస్తోందంటూ ప్రధాని మోదీ విమర్శించిన సంగతి తెలిసిందే.

శుక్రవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సాధ్వీ ప్రఙ్ఞా మోదీ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

“కాంగ్రెస్‌ హయాంలో అందరికీ అన్యాయమే జరిగింది. నరేంద్ర మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో.. ఆయన అనేక నేరాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్‌ నిందించారు.

కానీ అవన్నీ అవాస్తవాలని తేలాయి. ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు. అదే విధంగా కాంగ్రెస్‌ నన్ను కూడా నిందించింది. మోదీని, నన్ను వాళ్లు ఎంతగానో టార్చర్‌ చేశారు’’ అని పేర్కొన్నారు.

మోదీ ఇంటర్వ్యూ..

ఇక ఆజ్‌తక్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా.. 2008 మాలేగావ్‌ పేలుళ్లలో నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రఙ్ఞాకు టికెట్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నించగా.. కాంగ్రెస్‌ తనను కూడా ఎన్నో విషయాల్లో నిందితుడిగా చిత్రీకరించిందని బదులిచ్చారు.

సోషల్‌ మీడియాలో తనకు వ్యతిరేకంగా లక్షల కొద్దీ పోస్టులుంటాయని, అలాంటి వారి వల్ల అమెరికా తనకు వీసా నిరాకరించిందని పేర్కొన్నారు.

అయితే వాస్తవాలు వెల్లడైన తర్వాత తనకు వీసా నిరాకరించిన వారే స్వయంగా అమెరికాకు రావాలంటూ ఆహ్వానించారని చెప్పుకొచ్చారు.

ఇటీవల కపిల్‌ సిబల్‌ బ్రిటన్‌లో ఈవీఎంల గురించి అవాస్తవాలు ప్రచారం చేశారని, ఆధారాల్లేకుండా మాట్లాడటం వారికి అలవాటేనని ఎద్దేవా చేశారు.

About The Author