కుర్రాళ్ళు .. దొంగోళ్ళు … అందరూ బీటెక్ పట్టభద్రులే…
వాళ్లంతా బీ.టెక్ పూర్తి చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. మస్తుగా మందుకొట్టి, పోలీసులమంటూ దారిదోపిడీకి స్కెచ్ వేశారు. మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరిని చితకబాది నగదు, సెల్‌ఫోన్లు లాక్కున్నారు. మళ్లీ ఆ డబ్బుతో ఫుల్‌గా ఎంజా య్ చేశారు. ఆ మత్తు దిగేలోపు పోలీసులు వాళ్ల భరతం పట్టారు. నిందితులు దారిదోపిడీకి ఉపయోగించిన కారే చివరకు వాళ్లను పోలీసులకు పట్టించింది!
చిత్తూరు, పీలేరు రూరల్ : నకిలీ పోలీసులు హల్ చల్ చేసి దోపిడీకి పాల్పడిన సంఘటన మండలంలోని వేపులబైలులో వెలుగులోకి వచ్చింది.. పీలేరుకు చెందిన నిరంజన్ రెడ్డి (23), రెడ్డి శేఖర్ (22), రెడ్డి ప్రసాద్ (23) బంగారుపాళెంకు చెందిన చంద్ర (22) . తాము పోలీసులమని ద్విచక్ర వాహనం రికార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలని కొందరిని హడలెత్తించారు. ఇద్దరినీ చితకబాది 10,000 రూపాయలతో పాటు 2 సెల్‌ఫోన్లు లాక్కున్నారు. వీరి వాలకం అంతా అనుమానాస్పదంగా ఉండడంతో బాధితులకు వీళ్లు పోలీసులు కాదని బోధపడింది. మరుసటి బాధితులు పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితులను పట్టించిన కారు
——————————
దారిదోపిడీకి నిందితులు ఉపయోగించిన కారు కేసు ఛేదనలో కీలక ఆధారమైంది. బాధితులు అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ నిందితులు ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు నంబర్ ఏపీ 27 ఏఎక్స్ 6969ను గుర్తు పెట్టుకుని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఆ కారు నంబర్‌ను లాగితే ఈ దోపిడీ డొంకంతా కదిలింది.
తల్లిదండ్రులు విస్తుపోయారు.
———————————-
తమ పుత్రరత్నాల ఘనకార్యం గురించి పోలీసులు చెప్పేవరకూ తెలియకపోవడంతో నిందితుల్లో ముగ్గురి తల్లిదండ్రులు విస్తుపోయారు. పోలీస్‌స్టేషన్‌లోనే వాళ్ల చెంపలు వాయించినట్లు తెలిసింది. చేతికొచ్చిన పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టకపోతే చివరకు పోలీస్ స్టేషన్ గడప ఎక్కాల్సి వస్తుందనడానికి ఇదో ఉదాహరణ.