ఇంటర్ అవకతవకలపై 10 పేజీల నివేదిక…
తెలంగాణ ఇంటర్ ఫలితాలపై గందరగోళం నేపథ్యంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించింది. ప్రభుత్వానికి 10 పేజీల నివేదికను అందజేసినట్లు కమిటీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. అన్ని విషయాలను నివేదికలో పొందుపరిచామని, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను కూడా అందులో వివరించామని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని తెలిపారు. ఆయన వెంట కమిటీ సభ్యులు ప్రొ. నిశాంత్ కూడా ఉన్నారు. నివేదికను ప్రభుత్వం పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
సీఎస్‌తో జనార్దన్‌రెడ్డి సమావేశం
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అవకతవకలపై నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించిందని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందని, నివేదికను పరిశీలించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. 10 పేజీల నివేదిక సహా 46 పేజీల అనుబంధాలను కమిటీ అందించిందని తెలిపారు. అనంతరం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో సమావేశమయ్యారు. ఇంటర్ ఫలితాలపై త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికపై చర్చిస్తున్నట్లు సమాచారం.