అంకితభావంతో పనిచేస్తే ప్రైవేటుబడి ఈకముక్కతో సమానమని నిరూపించిన ప్రభుత్వ బడి విజయపథం…
దయచేసి అర్థం చేసుకోండి..సీట్లు అన్నీ అయిపోయాయి..పదే పదే వచ్చి మీ సమయం మా సమయం వృధా చేయవద్దు..అంటూ ఏకంగా ఒక బ్యానర్ స్కూల్ ముందు తగిలించారు..అంటే ఇది ఏ ప్రైవేటు బడో లేక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అని అనుకోవద్దు.
ఇది నెల్లూరులోని భక్తవత్సల నగర్లో ఉన్న కేఎన్ఆర్ మున్సిపల్ పాఠశాల విజయగాథ. ఇతర ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఈ స్కూల్ ఆదర్శంగా నిలుస్తోంది.
గొప్ప విషయం ఏంటంటే..ఇందులో ప్రవేశాల కోసం ప్రజా ప్రతినిధులతో సిఫారసులు చేయడం.
టీచర్ల అంకితభావంతో వస్తున్న ఉత్తమ ఫలితాల దెబ్బకు చుట్టుపక్కల ప్రైవేట్ బడులు మూసి వేయడం అంటే ఆ బడి ఎంత గొప్పగా విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.
ఈ పాఠశాల నేడు ఈ స్థాయికి రావడంలో ప్రధానోపాధ్యాయులు విజయప్రకాశరావు గారిదే ప్రధాన పాత్ర..రోజూ ఉదయం 7:30నుంచి రాత్రి 7:30 వరకు ఆయన స్కూల్లోనే ఉంటూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు.
ఆయన 2006లో పదోన్నతి పొంది కొద్దికాలం ఇదే స్కూల్ లో రెండేళ్ళు పనిచేశాక ఆయన్ను వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన్ను తిరిగి అదే స్కూల్ కి అక్కడి ప్రజలు తెచ్చుకున్నారంటే ఆయన పనితీరు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
సాధారణంగా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలలో తమ పిల్లలను చేర్పించడానికి ప్రయత్నిస్తారు.ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నం. పెద్దపెద్ద కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లలను అనేకమంది తల్లిదండ్రులు కేఎన్ఆర్ మున్సిపల్ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తుండటం విశేషం.
గతేడాది 350 అడ్మిషన్లు జరగ్గా, అందులో ఆరో తరగతిలో చేరేందుకు వచ్చిన వారికన్నా 7, 8, 9 తరగతుల్లో చేరేందుకు వచ్చినవారి సంఖ్య ఎక్కువగా ఉంది. వీరిలో 50 శాతానికిపైగా ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చినవారే. దీంతో ఇప్పటికే స్కూల్లో 7, 8, 9, 10
తరగతుల్లో పరిమితికి మించి విద్యార్థులు ఉన్నారు.గదులు సరిపోక నాలుగు సెక్షన్లు బయట కూర్చోబెట్టి బోధిస్తున్నారు. ఆరో తరగతిలో చేరేందుకు కూడా ఎక్కువమంది వస్తుండటంతో ఇంటర్వ్యూలు నిర్వహించి అడ్మిషన్లు ఇస్తున్నారు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఇక్కడకు వస్తున్నవారికి మొదటి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇక్కడ పనిచేసే నలుగురు ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ చేర్పించడం విశేషం.
చదువుతో పాటు సంస్కారం, సామాజిక స్పృహ కలిగినప్పుడే విద్యార్థి ఉత్తమ పౌరుడిగా ఎదుగుతాడని, ఆ పద్ధతిలోనే వారిని తీర్చిదిద్దుతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 2008 నుంచి పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్లలో కేఎన్ఆర్ పాఠశాల జిల్లాస్థాయిలో మొదటిస్థానంలో ఉంది.2010లో 582మార్కులతో ఇక్కడి విద్యార్థి కోవూరు సుధీర్ రాష్ట్రస్థాయిలో టాప్లో నిలిచాడు.
ప్రధానోపాధ్యాయుడి అంకితభావం,ఉపాధ్యాయుల నిబద్ధతే కేఎన్ఆర్ పాఠశాల విజయ రహస్యంగా పేర్కొనవచ్చు. ఏదో వచ్చామా.. పాఠాలు చెప్పామా.. జీతం తీసుకున్నామా..అని కాకుండా ఉపాధ్యాయులంతా విద్యార్థులను సొంత పిల్లల్లా భావిస్తుండడంతో ఫలితాల్లో తిరుగులేకుండా పోతోంది.
అందువల్ల మన నెల్లూరుకు అలాగే KNR పాఠశాలకి ముఖ్యంగా ఉపాధ్యాయులకి, మరి ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులకి గౌరవంతో నమస్తే తెలుపుతూ..అందరికి అభినందనలు తెలుపుదాం.