ఫొని తుఫానుపై అప్రమత్తంగా ఉండాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు….

https://youtu.be/YbhPc0ZmxE4

ఫొని తుఫానుపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఫొని తుఫానుపై బుధ వారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉంటూ, సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సంబంధిత రైతులకు తగు సూచనలు, సలహాలు అందించి పంటలు నష్టపోకుండా చూడాలని అన్నారు. తాగునీటి పథకాలు తాగు నీరు నిరంతరం అందించే విధంగా చూడాలని, అందుకు తగిన విధంగా జనరేటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని ఆసుపత్రుల్లో 24 గంటల వైద్య సేవలు అందేవిధంగా సిద్ధం చేయాలని, మందులు, ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అవసరం మేరకు ఉండాలని ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులకు తగిన విధంగా మనుషులు, స్తంభాలు, విడిపరికరాలు సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. మత్స్యకారులు అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, వేటకు వెళ్ళిన వారు ఉంటే వారి త్వరతిగతిన వచ్చేటట్లు చర్యలు చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అందుకు తగిన ఆహారధాన్యాలు, తాగునీరు, పాలు, బిస్కెట్లు, విద్యుత్ తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు. సౌరవిద్యుత్ దీపాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించకుండా పోలీసు తగు చర్యలు చేపట్టాలని అన్నారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ తుఫాను సమాచారం అందిన వెంటనే మత్యకారులను అప్రమత్తం చేసామన్నారు. ఎవరూ వేటకు వెళ్ళలేదని ఇప్పటి వరకు సమాచారం ఉందని చెప్పారు. మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించామని, గ్రామాలకు కూడా అధికారులను నియమించామని చెప్పారు. తాగు నీటి పథకాలను పూర్తిగా నింపి ఉంచడమే కాకుండా జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 48 పునరావాస కేంద్రాలను ఈ రోజు నుండి నిర్వహించుటకు ఏర్పాట్లు చేసామని తెలిపారు. వీటితోపాటు అదనంగా ప్రతి మండలంలో 5 వాటర్ ట్యాంకర్లను సిద్ధం చేసామని చెప్పారు. 9 ఎన్.డి.ఆర్.ఎఫ్ టీమ్ లను అడిగామని, అందులో ఇప్పటికే ఒక బృందం శ్రీకాకుళం చేరుకుందని చెప్పారు. దీనిని ఇచ్ఛాపురం పంపిస్తున్నామని తెలిపారు. టెలికమ్యూనికేషన్ సమస్యలేకుండా సంబంధిత నెట్ వర్కు సంస్ధలతో మాట్లాడామని, జనరేటర్లు, ఇంధనంతో వారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. లక్ష క్యూసెక్కులు దాటి నీటి ప్రవాహం వస్తే వరదలకు గురి అయ్యే గ్రామాలను అప్రమత్తం చేసామని చెప్పారు. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల పరిధిలో పర్యవేక్షక అధికారులుగా ఐ.ఏ.ఎస్ అధికారులను నియమించాలని కోరారు.

About The Author