డ్యామ్‌లో ఏర్పడిన గొయ్యి.. దాని తీవ్రతపై అధ్యయనం…
తొలిరోజు ఫ్లంజ్‌పూల్ దగ్గర అండర్‌వాటర్ వీడియోగ్రఫీ
పదిరోజులపాటు చేపట్టనున్న సముద్ర అధ్యయనాల సంస్థ
శ్రీశైలం,: శ్రీశైలాన్ని ముంచెత్తిన వరద నీటిని క్రస్ట్‌గేట్లను తెరిచి విడుదల చేయడంతో, గేట్ల ముందుభాగంలో భారీ గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యి డ్యామ్‌పై చూపించగల ప్రభావంపై సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై నిగ్గు తేల్చేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు.. నిపుణులతో ప్రత్యేకంగా సర్వే చేపట్టారు. డ్యామ్‌కు ప్రమాదం ఉందా? అది నిజమైతే, దాని తీవ్రత ఎంత? డ్యామ్ పునాదుల దాకా ఈ గొయ్యి ఉందా? అనే దానిపై గోవా, విశాఖకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ అనే సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు.అందులోభాగంగా గురువారం నుంచి డ్యాం ఫ్లంజ్‌పూల్ వద్ద అండర్‌వాటర్ వీడియోగ్రఫీ సర్వే చేపట్టారు.
ఈ సర్వే కోసం ఎనిమిది మంది శాస్త్రవేత్తలు శ్రీశైలం చేరుకున్నారు. తొలిరోజు ప్రాథమికంగా ఫ్లంజ్‌పూల్ వద్ద నీటిలో ఎంత లోతు వెళ్లవచ్చునని ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ సర్వే చేపట్టారు. పది రోజుల పాటు ఈ సర్వే చేస్తారు. గతంలో చేపట్టిన బ్యాతమాటికల్, అండర్‌వాటర్ వీడియోగ్రఫీ సర్వే నివేదికలను క్రోడీకరించుకుని ప్రస్తుత సర్వే నివేదికను విజయవాడలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్‌కి సీడబ్ల్యూసీ ప్రాజెక్టు నిపుణుల బృందానికి పంపిస్తారు. వారి సూచనల మేరకు ఫ్లంజ్‌పూల్ పటిష్ఠతకు చేపట్టే చర్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. డ్యామ్ మెయింటెనెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాంబశివారెడ్డి, డీఈ గోపాల్‌నాయక్, ఏఈ లక్ష్మీనారాయణ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.
ఇది మూడోసారి ..
1999, 2009లో శ్రీశైలానికి ఊహించని విధంగా భారీ వరద చేరింది. డ్యామ్ 12 రేడియల్ క్రస్ట్‌గేట్లను తెరచి దిగువకు నీరు విడుదల చేశారు. ఈ క్రస్ట్‌గేట్లను పూర్తిస్థాయిలో పైకి తెరవడంతో వాటి ద్వారా విడుదలైన నీటి వేగానికి డ్యామ్ దిగువన భారీ గొయ్యి ఏర్పడింది. 1999 వరదల కారణంగా 60అడుగుల లోతులో ఫ్లంజ్‌పూల్ వద్ద గొయ్యి ఏర్పడగా, 2009 వరదల కాలంలో 100అడుగుల లోతుకు ఆ గొయ్యి చేరిందని సేఫ్టీ నిపుణుల కమిటీ తేల్చింది. ఈ గొయ్యి లోతు, వెడల్పు తెలుసుకునేందుకు గత ఏడాది జనవరి 30న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ సంస్థ బ్యాతమాటికల్ సర్వే నిర్వహించింది.
ఫ్లంజ్‌పూల్ అంటే ..
శ్రీశైలం డ్యామ్ రేడియల్ క్రస్ట్‌గేట్ల నుంచి వరద నీరు విడుదలై స్పిల్‌వే ద్వారా డ్యామ్ దిగువన ఉన్న తొట్టిలోకి చేరుతుంది. అక్కడి నుంచి డ్యామ్ పునాదులకు దూరంగా నీరు పడుతుంది. ఇలా వరద నీరు పడే ప్రాంతాన్ని ఫ్లంజ్‌పూల్ అంటారు. ఫ్లంజ్‌పూల్ పటిష్ఠతను దృష్టిలో ఉంచుకొని.. నిర్మాణ సమయంలోనే అత్యంత బలమైన కాంక్రీట్ డ్రమ్స్‌ను డ్యామ్‌లో ఏర్పాటు చేస్తారు.