శ్రీకాకుళం జిల్లా పై ఫోనీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు… కలెక్టర్ జె.నివాస్
https://www.youtube.com/watch?v=oLwJSi3pZW0
శ్రీకాకుళం జిల్లా పై ఫోనీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా తీర ప్రాంతం వెంబడి ఫోని తుఫాన్ పయనించడంతో ఆంధ్రా ఒడిశా సరిహద్దు ఇచ్చాపురం కవిటి సోంపేట కంచిలి మండలాల్లో దీని ప్రభావం తీవ్రంగా చూపింది. గాలుల తీవ్రతకు ఇచ్చాపురం లో మూడు ఇల్లు నేలకొరిగాయి. జిల్లాలో పలు చోట్ల విద్యుత్ స్థంబాలు నేలకొరగడంతో వాటిని పునరుద్ధరిస్తున్నారు.
మరో వైపు తీర ప్రాంతం లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. రహదారులు చెట్లు అనేక చోట్ల దెబ్బతిన్నాయి. ఈ రాత్రి కి విద్యుత్ పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని తీర ప్రాంత వాసులు అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ కోరారు. జిల్లా వ్యాప్తంగా 132 విద్యుత్ స్థంబాలు దెబ్బతిన్నాయని 15 వేల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారని అన్నారు. ఈ రోజు ఉదయం నుంచి వాతావరణంలో మార్పు రావడం, ఫోని తుఫాన్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలు వారి వారి సొంత ఇంటికి చేరుకున్నారని కలెక్టర్ చెప్పారు. సముద్రానికి దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా తరలించడం వల్ల ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. ఒరిసా లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదున శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి,వంశధార, మహేంద్రతనయ బాహుదా నదుల పరిధిలో వరద ముప్పు ఉన్నందున నదీ పరివాహక ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు.
మరో వైపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి ఫోనీ తుఫాన్ పై కంట్రోల్ రూమ్ లో అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.