పార్లమెంటు భవనం ఈ గుడికి జీరాక్స్ కాపీ…

చరిత్రను వీపున మోసి మోసి సొలసినట్టుండే ఆ బండరాళ్ల గుట్ట పైకి ఒక్కొక్క మెట్టూ ఎక్కి పైకి చేరుకుంటే…వినీలాకాశపు గొడుగు కింద చక్రాకారంలో కాలపు అనంత తత్వానికి ప్రతీకా అన్నట్టున్న ఒక దేవాలయం దర్శనమిస్తుంది.

ఆకాశాన్నంటేగోపురాలుండవు. కానీ ఎంతో విశాలమైనది ఆ దేవాలయం. ఏదో రహస్య జ్ఞానానికి గుహ్యతమ తపో మార్గంలాగా ఉంటే ఒక చిన్న ద్వారం…

అయితే ఆ గుడిని అప్పుడే మొట్టమొదటిసారి చూసినట్టు అనిపించదు.

చిరపరిచితమైనదానిలా..
ఎన్నో సార్లు చూసినట్టు అనిపిస్తుంది. “ఎక్కడ చూశాం దీన్ని… ఎక్కడ చూశాం?”
మనసులో ప్రశ్నలు పాశుపతాస్త్రాలౌతాయి.
“ఇది మన పార్లమెంటు భవనంలా లేదూ….!!?” అని ఒక్కసారి స్ఫురిస్తుంది.

“నిజమే…. ఢిల్లీలో మన జనతా జనార్దనుడి కొలువూ, ప్రజాస్వామ్యానికి నెలవూ అయిన పార్లమెంటులాగానే ఉంది….” అనిపిస్తుంది.

లాగానే ఉండటమేమిటి? ఈ గుడి నిర్మాణ శైలిని చూసి ప్రేరణ పొందిన బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఎడ్వర్డ్ బేకర్, లుట్యెన్స్ లు 1912 లో మన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఈ నిర్మాణ శైలి వారినిఎంతగాఆకట్టుకుందంటే వారింకే మోడల్నూ పరిశీలించ లేదు. పార్లమెంటు భవనం దీనిలాగానే ఉండితీరాలన్న నిర్ణయానికి వచ్చేశారు. కొద్ది మార్పులతో పార్లమెంటు మోడల్ సిద్ధమైంది. అందరి ఆమోదమూ లభించాక నిర్మాణం మొదలైంది. అచిర కాలంలోనే ఢిల్లీ తలపై మకుట మణిలాంటి అందమైన పార్లమెంటుభవనంతయారైంది.

పార్లమెంటుకే మాతృక అయిన ఆ గుడిపేరు ఏకాటేశ్వర మందిర్. మధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో మొరీనా జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో మతౌలీ అన్న చిన్న గ్రామంలో ఈ మందిరం ఉంది. ఈ గుడి తప్ప ఆ ఊళ్లో చూసేందుకు ఇంకేమీ లేదు. భారత్ అనే బంగారు ఖజానాకి తాళంచెవిగా బ్రిటిషర్లుపేర్కొన్న గ్వాలియర్ కోట నుంచి కూడా మతౌలీ కేవలం 40 కి.మీ దూరమే. ఢిల్లీ నుంచి కూడా పెద్ద దూరమేమీ కాదు.
{అన్నట్టు మొరీనా జిల్లా బోలీకి (విచిత్రమైన హిందీయాసకి), గోలీకి (చంబల్ బందిపోట్ల తూటాలకీ) పేరొందింది.}
ఏకాటేశ్వర మందిరం 8వ శతాబ్దం నాటిది. ప్రతీహార రాజుల ప్రాచీన భవన నిర్మాణశైలీ వైభవం ప్రాణం పోసుకున్నట్టుండే ఈ దేవాలయానికి వందస్తంభాలు. కానీ ఒకే ఒక్క ప్రవేశ ద్వారం. లోపలకి వెళ్లగానే చక్రాకారంలో ఉన్న ఆ కట్టడం నట్టనడుమ గర్భగుడి….. అందులో ఏకాటేశ్వరనాథుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.

చక్రాకార భవనంలో 64 గదులుంటాయి. ఒక్కో గదిలో ఒక్కో శివలింగం… ఆ శివలింగాన్ని అర్చిస్తున్న ఒక్కో యోగిని విగ్రహం ఉంటాయి. అందుకే దీన్ని చౌసట్టి యోగిని దేవాలయం అని కూడా చెబుతూంటారు.

కాలం పెట్టిన పరీక్షలకు తట్టుకుని, శతాబ్దాల దాడుల్ని సహించి మరీ మతౌలీలో పార్లమెంటు మాతృక మృత సంజీవనిని సేవించిన భారతీయ ధర్మవైభవంలా నిలిచింది.ఆధునికులఅలక్ష్యం. పాలకుల నిర్లక్ష్యం వల్ల అవహేళనకు గురౌతున్న మన ధర్మం లాగానే గుడి కూడా జరాజీర్ణ అవస్థకు చేరుకుంది. గుడి గోడలపై ప్రేమికులు వ్రాసుకున్న ప్రేమసందేశాలు కనిపిస్తాయి. తరాల చరిత్రను తనలో దాచుకున్న ఈ విశిష్ట దేవాలయం ఇప్పుడు అవహేళనకు గురై అజ్ఞాతంలో మగ్గుతోంది….అచ్చు మన సంస్కృతిలాగానే…..
ఈ పరమాద్భుతాన్ని కాపాడు కోవడమే మన కర్తవ్యం…

About The Author