పోలవరంపై 90 సార్లు సమీక్షించా :చంద్రబాబు
పోలవరంపై 90 సార్లు సమీక్షించా :చంద్రబాబు
పోలవరం : పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. స్పిల్‌వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు.
‘పోలవరం ప్రాజెక్టు పనులు 70.17 శాతం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకూ 90 సార్లు సమీక్షలు జరిపాను. 30 సార్లు క్షేత్రస్థాయిలో పర్యటించాను. ఈ ప్రాజెక్టు ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగునీరు, 980 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుంది. ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు ఉండగా.. 30 లక్షల క్యూసెక్కులు వదిలేలా వీటి నిర్మాణం జరుగుతోంది. ప్రాజెక్టు కోసం రూ.16,493 కోట్లు ఖర్చుపెట్టాం. కేంద్రం రూ.6,727 కోట్లు ఇచ్చింది. ఇంకా రూ.4,631 కోట్లు రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరవును జయించవచ్చు. 1941 నుంచి పోలవరంపై నేతలు ఎన్నికల సమయంలో మాట్లాడుతూనే ఉన్నారు’ అని చంద్రబాబు తెలిపారు.