చంద్రబాబుకి సుప్రీంకోర్టు షాక్…
వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు
పిటిషన్ తిరస్కరణ*
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు సహా 21 ప్రతిపక్ష పార్టీల నేతలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కనీసం 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను తప్పనిసరిగా లెక్కించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విపక్షాలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
ఈ అంశంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చే ఉద్దేశం తమకు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్ పై కేవలం నిమిషంలో వాదనలు ముగించి కోర్టు తీర్పు ఇచ్చింది.
50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు తప్పనిసరిగా లెక్కించాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు సహా 21 ప్రతిపక్ష పార్టీల నేతలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
దీనిపై మంగళవారం (మే 7,2019) విచారించిన కోర్టు.. పిటిషన్ ను కొట్టివేసింది.
కోర్టు నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని విపక్షాల తరుపు న్యాయవాది సింఘ్వీ తెలిపారు. తమ రివ్యూ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిందని ఆయన చెప్పారు. విపక్షాలు కోరినట్టు వీవీ ప్యాట్ స్పిప్పులు లెక్కించాలంటే వారం రోజుల సమయం పడుతుందని ఈసీ గతంలో తెలిపిన సంగతి తెలిసిందే.
ఎన్నికల ఫలితాల్లో లెక్కించే వీవీ ప్యాట్ స్పిప్పుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ సీఎం చంద్రబాబు నేతృత్వంలో 21 ప్రతిపక్ష పార్టీల నేతలు గతంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
దీన్ని విచారించిన ధర్మాసనం.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ స్పిప్పులను ఈవీఎంలలో పోలైన ఓట్లతో సరిపోల్చాలని ఏప్రిల్ 8న ఈసీని ఆదేశించింది.
ఈ ఆదేశాలపై సంతృప్తి చెందని ప్రతిపక్షాలు ఈ సంఖ్యను 50శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ మరోసారి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, వారి పిటిషన్ ను కోర్టు తిరస్కరించడం జరిగాయి.