సర్జికల్ దాడులకు ఉట్టి మాట (2004౼2014)…
యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన సర్జికల్ దాడులకు సంబంధించి తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. 2004-14 మధ్య కాలంలో జరిగిన సర్జికల్ దాడుల వివరాలు కావాలంటూ రక్షణ శాఖ అధికారులను జమ్మూ ప్రాంతానికి చెందిన రోహిత్ చౌదరీ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా కోరారు.
దీనికి స్పందించిన అధికారులు 2004-14 మధ్య జరిగిన సర్జికల్ దాడులకు సంబంధించి తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని బదులిచ్చారు. అంతేకాకుండా 2016 సెప్టెంబర్ 29న జరిగిన దాడుల వివరాలు మాత్రమే తమ వద్ద ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.
తమ హయాంలో ఆరు సార్లు మెరుపుదాడులు జరిగాయంటూ కొద్దిరోజులుగా కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ప్రచారానికి విరుద్ధంగా ఈ సమాధానం వచ్చింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికార, విపక్ష పార్టీల మధ్య మెరుపు దాడుల గురించి విమర్శ, ప్రతివిమర్శలు చోటుచేసుకుంటున్నాయి.
తమ హయాంలో కూడా మెరుపుదాడులు జరిగాయంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. అదేమీ వీడియో గేమ్ కాదని విమర్శించారు.