బతుకుదెరువు కోసం వచ్చి నరకం అనుభవిస్తున్నా.. స్పందించిన కేటీఆర్…


బతుకుదెరువు కోసం వచ్చి నరకం అనుభవిస్తున్నా.. స్పందించిన కేటీఆర్

జీవించడం కోసం జీవితాన్ని కోల్పోవడం అంటే ఇదేనేమో. బ్రతుకుదెరువు కోసం అబుదాబి వెళ్లిన ఓ తెలంగాణవాసి కష్టాలు సోషల్ మీడియా ప్రచారంతో వెలుగులోకి వచ్చాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం అబుదాబి వెళ్లాడు. అబుదాబికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి వద్ద పనికి కుదిరాడు. అతడి ఒంటెలను కాయడం ఇతడి పని. కాగా బతుకుదెరువుకు వెళ్లిన వ్యక్తి యజమాని చేతిలో నరకయాతన అనుభవిస్తున్నాడు. ఓ వీడియో ద్వారా తన గోడును ఇలా వ్యక్తపరిచాడు. మాది కరీంనగర్ జిల్లా తుమ్మాపురం మండలం. మాది పేద కుటుంబం. అబుదాబికి వచ్చి రెండేళ్లు అవుతుంది. మా యజమానికి వంద ఒంటెలు ఉన్నాయి. వాటిని నేనొక్కడినే చూసుకోవాలి. ఒక ఒంటె చనిపోవడంతో మా యజమాని నన్ను పొట్టుపొట్టుగాను చావగొట్టిండు. దవడ పండ్లు ఊడి మాట్లాడవస్తలేదు సార్. నేనుండే ప్రాంతంలో కరెంటు ఉండదు. సద్ది తెచ్చిఇచ్చే వాళ్లు ఉండరు. పనంతా చేసి మా తిండి మేమే కట్టెల పొయ్యి మీద వండుకోవాలి. మా యజమాని జీతం ఇవ్వక, తిండి పెట్టక హింసిస్తున్నాడు. భార్య ఆస్పత్రిలో ఉందని చెప్పినా చూడనికి సైతం పంపిస్తలేడు. మా అమ్మ చచ్చిపోతే కూడా పంపిస్తలేడు సార్. దయచేసి మమ్మల్ని ఇండియా తీసుకుపోండి సార్ అని ప్రాధేయపడుతున్నాడు. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. కేటీఆర్ స్పందిస్తూ.. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, యూఏఈలో భారత రాయబారి ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా కోరారు. అతన్ని ఎలాగైనా విడిపించి భారత్‌కు వచ్చేలా చూడాల్సిందిగా కోరారు. కేటీఆర్ ట్వీట్‌కు యూఏఈ భారత రాయబారి నవదీప్ సూరి స్పందించారు. రియాద్‌లోని ఎంబసీ సదరు వ్యక్తి అంశాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. ప్రతిగా కేటీఆర్.. నవదీప్ సూరికి కృతజ్ఞతలు తెలిపారు.

About The Author