సీఈవో రవిప్రకాష్ పై సైబర్ క్రైంలో ఫోర్జరీ కేసు నమోదు…
ముదురుతున్న TV9 యాజమాన్య వివాదం… సీఈవో రవిప్రకాష్ పై సైబర్ క్రైంలో ఫోర్జరీ కేసు నమోదు…
తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో TV9 ప్రస్థానాన్ని ఓ సంచలనంగా చెప్పుకోవచ్చు… ఇంతై వటుడింతై అన్నట్టు… అనతి కాలంలోనే TV9 తెలుగులోనే కాక ఇతర ప్రాంతీయ భాషలలోను తన ఉనికిని చాటుకొంది… TV9 అనే బ్రాండ్ కు ఇంతటి క్రేజ్ రావడం వెనుక రవిప్రకాష్ కష్టాన్ని ఎవరూ కాదనలేరు… సంస్థ ప్రస్థానంలో ఇన్నాళ్ళు అన్నీ తానై నడిపించిన సీఈవో రవిప్రకాష్ ప్రాభవం పై నీలి నీడలు కమ్ముకొంటున్నాయి…
తన సంతకాన్ని సీఈవో రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని, అలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ పుల్లూరి కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి రవి ప్రకాష్ అడ్డుతగులుతున్నారని కౌశిక్‌రావు ఆరోపిస్తున్నారు.
జూన్ 1, 2018 లో మైహోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు, ప్రేమ్ కుమార్ పాండే, పుల్లూరి కౌశిక్ రావు, మునగాల అర్జున్ ప్రణీత్ లు డైరెక్టర్లుగా ఆర్‌వోసీ లో నమోదైన “అలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్” అనే సంస్థ, కొద్ది రోజుల కిందట ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ 9ను టేకోవర్ చేసింది.
అయితే ఏబీసీఎల్ కార్పోరేషన్ లో తనకు నలభై వేల షేర్లు ఉన్నాయని, తన అనుమతి లేకుండా కంపెనీ బదలాయింపు ప్రక్రియ జరుగరాదని, నటుడు శివాజి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే….
కంపెనీకి చెందిన నిధులు దారి మళ్ళాయనే ఆరోపణలపై సీఈవో రవిప్రకాష్ ను తప్పుకోవాలని కొత్త యాజమాన్యం ఒత్తిడి తెస్తోంది, అందుకు రవిప్రకాష్ ససేమిరా అన్నట్టు సమాచారం.. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రవిప్రకాష్ పై అలంద మీడియా డైరెక్టర్లలో ఒకరయన పుల్లూరి కౌశిక్ రావు, తన సంతకాన్ని ఫోర్జరీ చేసారనే ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే రవి ప్రకాష్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే టీవీ 9 కార్యాలయంలోని కొన్ని కంప్యూటర్లను కూడా పరిశీలించినట్టు సమాచారం.
నిజానిజాలు ఏవైనా… కార్పొరేట్ బలం ముందు జర్నలిస్టులు నిలబడగలరా అన్నదానిపై ప్రస్తుతం పరిశ్రమలో ప్రధానంగా వినిపిస్తిన్న చర్చ.