యాదాద్రిలో ఇక బెల్లం లడ్డూలు…

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాదాద్రిశ్రీలక్ష్మీనరసింహస్వామివారి భక్తులకు బెల్లంతో చేసిన లడ్డూలను విక్రయించడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. గురువారం ప్రయోగాత్మకంగా బెల్లంతో లడ్డూలను తయారు చేసే విధానాన్ని ఆలయ కమిటీ పరిశీలించింది. ఆలయ ఈవో ఎన్.గీత బెల్లంతో లడ్డూలను తయారు చేసే విధానం అందుకయ్చే ఖర్చులు వివరాలతో నివేదిక ఇవ్వాలని 15 మందితో దిట్టం నిర్ణయానికి కమిటీని ఏర్పాటు చేశారు. బెల్లంతో లడ్డూలను తయారు చేయడం ద్వారా ఎంత ఖర్చు అవుతుంది? బెల్లం పానకంతో తయారు చేసే లడ్డూలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? ఎంత ధరకు విక్రయించవచ్చు తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో ఆలయ కమిటీలో సభ్యులైన ఐదుగురు ఏఈవోలు దోర్బల భాస్కర్, వేముల రామ్మోహన్, మేడి శివకుమార్, గజవెల్లి రమేశ్‌బాబు, జూశెట్టి కృష్ణాగౌడ్, ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, పర్యవేక్షకులు విజయ్‌కుమార్, వెంకటేశ్వర్లు వంట సెక్షన్ నిపుణులు మరింగంటి నర్సింహాచార్యులు, మధుసూదనాచార్యులు, టి. వాసు, డి. వెంకటరమణాచార్యులు, హరి, రామాచార్యులుల ఆధ్వర్యంలోని కమిటీ సమక్షంలో లడ్డూలను తయారు చేసేందుకు 5 కిలోల శనగపిండిని తీసుకుని గురువారం సాయంత్రం ప్రయోగాత్మకంగా తయారు చేశారు. ఒక కిలో శనగపిండి ఒక కిలో బెల్లం, 600 గ్రాముల నెయ్యి, 75 గ్రాముల కాజు, 50 గ్రాముల కిస్‌మిస్, 50 గ్రాముల మిశ్రి, 10 గ్రాముల ఇలాచీ, 2 గ్రాముల జాజికాయ, 2 గ్రాముల పచ్చ కర్పూరం, 4. 6 కిలోల గ్యాస్‌తో 100 గ్రాముల లడ్డూలు 42, 500 గ్రాముల లడ్డూలు 8.4 తయారు చేశారు. దీనికైన ఖర్చును కూడా పేర్కొంటూ ఆలయ ఈవో గీతకు నివేదిక సమర్పిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. బెల్లం లడ్డూ తయారీ ఇలా … లడ్డూ తయారీలో చక్కెర స్థానంలో బెల్లం ఉపయోగిస్తారు. మిగతా అన్ని యథావిధిగా ఉంటాయి. శనగపిండి మిశ్రమాన్ని నిర్దిష్ట ఉష్ణోగ్రతతో వేడి చేసిన నెయ్యిలో జల్లించి బూందీని సిద్ధ్దం చేస్తారు. ముడిబెల్లం ముద్దలను పగులగొట్టి పానకం తయారు చేస్తారు. పానకంలోని చెరుకు గడల పిప్పిని వేరు చేస్తారు. ఫిల్టర్ చేసిన పానకాన్ని మరోమారు వేడి ముదురు పానకం తయారు చేసి లడ్డు బూందీలో కలిపి బెల్లం లడ్డూ మిశ్రమాన్ని సిద్ధం చేస్తారు. ఈ మిశ్రమంలో తగు పరిమాణంలో కాజూ, కిస్‌మిస్‌లతో పాటు ఇలాచీ, జాజికాయ, పచ్చకర్పూరం, పొడిని కలిపిన లడ్డు మిశ్రమాన్ని పాత్రల్లోకి చేర్చి కావాల్సిన పరిమాణంలో లడ్డూ ప్రసాదాలను తయారు చేసి ట్రేలలో అమర్చుతారు. చక్కెర లడ్డూలు యథాతథం … బెల్లంతో లడ్డూలు తయారు చేసి విక్రయాలు ప్రారంభించినా చక్కెర లడ్డూలు యథాతథంగా అమలులో ఉంటాయి. వీటి ధర ఇప్పుడున్న రూ.20 ఉంటుంది. బెల్లంతో తయారు చేసే లడ్డూల ధరలు ఎంత ఉండాలనే విషయం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని ప్రసాదం తయారీ విభాగం ఏఈవో గజవెల్లి రమేశ్‌బాబు చెప్పారు. బెల్లం లడ్డూల తయారీకయ్యే ఖర్చును పేర్కొంటూ ఈవో గీత కమిషనర్‌కు నివేదిక పంపిస్తారు.

About The Author