చనిపోయాడనుకున్న వాడు తిరిగొచ్చాడు… హంతలకునేవాళ్ళు జైల్లో ఉన్నారు…

ఇది సినిమాల్లో మాత్రమే చూసే సీన్. బ్రతికేవున్న మనిషి చనిపోయాడని కేసుకట్టి హంతకులుగా ముద్రవేసి జైలుకు పంపి , కొన్నేళ్ల తరువాత చనిపోయినమనిషి బ్రతికిఉండటం పోలీసులు నోరెళ్లబెట్టడం .. సాధారణం సినిమాల్లో చూపించే క్రైమ్ సీన్ .. ఇప్పుడు నిజంగానే జరిగింది..
రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అప్పట్లో పోలీసులు ఇద్దరు పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. మృతుడు మరో ప్రాంతంలో తిరుగుతుండటాన్ని గుర్తించిన గ్రామస్తులు అతడిని పోలీసుస్టేషన్‌లో అప్పగించిన ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల దర్యాప్తు ఏ స్థాయిలో సాగుతుందో ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌లో చెన్నేకొత్తపల్లి మండలం హరేన్‌చెరువుకు చెందిన తలారి శ్రీనివాసులు (38) హత్యకు గురైనట్లు పెనుకొండ పోలీసులు 2017 మార్చి 20న కేసు నమోదు చేశారు. హత్య చేశారనే అభియోగంతో హరేన్‌చెరువుకు చెందిన భాస్కర్‌రెడ్డి, ఓబిరెడ్డి అనే వ్యక్తులను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.
ఆ తర్వాత పోలీసులు అప్పగించిన మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. సీన్‌ కట్‌చేస్తే.. మృతుడు తలారి శ్రీనివాసులును హరేన్‌చెరువు గ్రామస్తులు శనివారం ధర్మవరంలో గుర్తించి అతన్ని చెన్నేకొత్తపల్లి పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయకుండా అమాయకులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గొల్లపల్లి రిజర్వాయర్‌లో చనిపోయినది శ్రీనివాసులు కాదని తేలడంతో అప్పట్లో వెలుగుచూసిన మృతదేహం ఎవరిదనే ప్రశ్న ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది. కేసును మూసివేసి చేతులు దులుపుకున్న వారికి ఈ కేసు కత్తి మీద సాముగా మారనుంది.
విచారణ చేపడతాం
అప్పట్లో ఈ కేసును ఎస్‌ఐ లింగన్న చూశారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో చనిపోయిన వ్యక్తి హరేన్‌చెరువుకు చెందిన తలారి శ్రీనివాసులుగా గుర్తించి కేసు నమోదు చేసి అనుమానితులను రిమాండ్‌కు పంపడం వాస్తవమే. తాజాగా ఆయన బతికే ఉన్న నేపథ్యంలో కేసును పునఃసమీక్షిస్తాం.పెనుకొండ ఎస్‌ఐ, చెప్పారు…

About The Author