జులైలో బల్దియా ఎన్నికలు…


*రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి నిర్వహణకు కసరత్తు*

*పురపాలక శాఖకు ముందే సమాచారం*

*అధికార వర్గాల్లో జోరుగా చర్చలు*

*మూడున్నరేండ్లకే జీహెచ్‌ఎంసీ పాలకవర్గం రద్దు?*

*తెలంగాణ రాష్ట్రంలో ‘ముందస్తు కాలం’ నడుస్తున్నది. తెలంగాణ అసెంబ్లీని ముందస్తుగానే రద్దు చేసి ఎన్నికలకు పోయిన టీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించింది. అదే ఉత్సాహంతో గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ అధిక స్థానాలను కైవసం చేసుకుంది. అంతలోనే పార్లమెంట్‌ ఎన్నికలు, మండల పరిషత్‌ ఎన్నికలు వచ్చాయి. ఇదేజోరుతో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని సర్కార్‌ యోచిస్తున్నది. అయితే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలనూ నిర్వహించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఏడాదిన్నర కాలం ఉండగానే బల్దియా పాలకవర్గాన్ని ముందస్తుగానే రద్దుచేయాలని అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విషయాన్ని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అధికారులకు ఇప్పటికే సమాచారమిచ్చినట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. అధికారులు సైతం ఈ విషయంపై అవుననే సమాధానమిస్తున్నారు. అయితే కనీసం నాలుగేండ్లయినా పూర్తికాకుండానే పాలకవర్గాన్ని రద్దు చేయడమేంటని కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.*

*రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. కోటికిపైగా జనాభా కల్గిన హైదరాబాద్‌ మహానగరంలో సుమారు 75 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఎన్నికల్లో 150 వార్డులకుగాను టీఆర్‌ఎస్‌ 99, మజ్లీస్‌పార్టీ 44, బీజేపీ నాలుగు, కాంగ్రెస్‌ రెండు, టీడీపీ ఒక వార్డులను కైవసం చేసుకున్నాయి. టీఆర్‌ఎస్‌ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసింది. మేయర్‌గా బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసీయొద్దీన్‌ బాధ్యతలు స్వీకరించారు. 2009లో జరిగిన బల్దియా ఎన్నికల్లో జీరో స్థానాలున్న టీఆర్‌ఎస్‌ 2015లో హీరో అయింది. అదే 2009 ఎన్నికల్లో హీరోగా ఉన్న కాంగ్రెస్‌ 2015 ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌, టీడీపీ సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం బల్దియా పాలకవర్గంలో టీఆర్‌ఎస్‌, మజ్లీస్‌పార్టీ, బీజేపీలు మాత్రమే ఉన్నాయి. 150 వార్డుల్లో సగానికిపైగా మహిళా కార్పొరేటర్లు ఉన్నారు.*

*మూడున్నరేండ్లకే రద్దు ?*

*ఫిబ్రవరి 2015 జీహెచ్‌ఎంసీ పాలకవర్గం కొలువుదీరింది. ఫిబ్రవరి 2019 నాటికి పాలకవర్గం మూడేండ్లు పూర్తి చేసుకుంది. ఆగస్ట్‌ నాటికి మూడున్నరేండ్లు పూర్తిచేసుకోనుంది. కానీ మరో ఏడాదిన్నర కాలం ఉండగానే బల్దియా పాలకవర్గాన్ని రద్దు చేయాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇప్పటికే అధికారవర్గానికే సమాచారమిచ్చారని పలువురు చెబుతున్నారు.*

*అన్నింటితో పాటే..*

*మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లతో పాటు జీహెచ్‌ఎంసీకి సైతం ఎన్నికలు నిర్వహించడానికి సర్కార్‌ సిద్ధమైనట్టు అధికారులు చెబుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం విధితమే. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌, రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికల కోడ్‌ ముగియగానే జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించే అవకాశముందని అధికారులు చర్చించుకుంటున్నారు. వార్డుల్లో మార్పులు చేర్పులు, ఓటరు జాబితా, పోలింగ్‌ కేంద్రాలు కేటాయింపు, ఇతర పనులను జూన్‌లోనే పూర్తిచేసి జూలైలోనే బల్దియా ఎన్నికలు నిర్వహించడానికి అవకాశముందని అధికారులు చెబుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు, పరిషత్‌ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.*

About The Author