టివి9 రవిప్రకాష్ దేనికి ప్రతీక!?


అవినీతిపరులను తన ఛానల్ వెంటాడిందని చెప్పుకునే ఆ ఛానల్ మాజీ సిఇవో రవిప్రకాష్ ప్రస్తుతం చట్టం వెంటపడడం అంటే ఏమిటో అనుభవం ద్వారా తెలుసుకుంటున్నారు. నోటీసు ఇచ్చిన పోలీసుల ముందు హాజరయి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో విఫలయత్నం చేశారు. ఈ మధ్యలో హిందుస్థాన్ టైమ్స్ విలేఖరితో మాట్లాడుతూ, జర్నలిజంలో బిల్డర్లు, కాంట్రాక్టర్ల లాబీని అంతం చేసేందుకు పోరాడుతానని రవిప్రకాష్ చెప్పుకున్నారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లు అంటే ఆయన దృష్టిలో ఎవరో ప్రత్యేకించి వివరించనక్కరలేదు. వారికి టివి9 గ్రూప్‌ను విక్రయించిన ఐల్యాబ్స్ శ్రీనిరాజు బిల్డరో, కాంట్రాక్టరో కాకపోవచ్చుకానీ ఆయనా పెట్టబడిదారుడే. 2004లో ఆయనతోనే రవిప్రకాష్ టివి9 ఛానల్‌కు పెట్టుబడి పెట్టించారు.
టివి9 ప్రస్థానాన్ని సక్సెస్ స్టోరీ అంటే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. టివి9 సిఇవోగా ఇటీవల ఉద్వాసనకు గురయిన రవిప్రకాష్ కాస్త లేటుగా పంపించిన రాజీనామా లేఖలో చెప్పిన అనేక అసత్యాల నడుమ ఒక సత్యం ఉంది. అదేమంటే తాను ఇవాళ దేశంలో బాగా లాభాలు ఆర్జిస్తున్న ఒక మీడియా గ్రూప్‌ను సృష్టించానన్నది. నిజమైన అకింతభావంతో, ‘కసి’తో టివి9 కోసం పని చేసిన ఒక టీము దాని విజయం వెనుక ఉంది నిజమే కానీ, లీడర్‌గా రవిప్రకాష్ ఆ ఖ్యాతి క్లెయిము చేస్తే ఆక్షేపించాల్సిన అససరం లేదు.
బ్రేకింగ్ న్యూస్ ఆటతో టివి9ను పరుగులెత్తించిన రవిప్రకాష్ మిగతా ఛానళ్లకు తానే ఒక బ్రేకింగ్ న్యూస్ అయ్యారు. నిన్నటివరకూ తాను నడిపిన ఛానల్‌లో కూడా తాను బ్రేకింగ్ న్యూస్ అవడం ఆయనకు చాలా బాధ కలిగించిఉండాలి. మొదటిరోజుకీ, రెండవరోజుకీ మధ్య రాత్రి రవిప్రకాష్ నాటకీయంగా టివి9 స్టూడియోలో ప్రత్యక్షం అయ్యి తానే సిఇవోనని ప్రకటించుకున్నారు. ఆ సమయంలో ఆయన సాటి న్యూస్ ఛానళ్లకు హితవు చెప్పారు. టివి9 పరిణామాల కవరేజిలో ఛానళ్లు కాస్త ప్రొఫెషనలిజం పాటించాల్సిందని ఆయన అన్నారు.
నిజమే, రవిప్రకాష్ చెప్పినదాంట్లో వాస్తవం ఉంది. టివి9 పరిణామాల కవరేజిలో ఏ ఛానల్ అయినా ముందు చెయ్యాల్సింది రవిప్రకాష్ వాదన తెలుసుకోవడం (రవిప్రకాష్ అందుబాటులో ఉన్నరా అన్న ప్రశ్న ఇక్కడ వద్దు). ఏ ఛానల్ అయినా ఆ ప్రయత్నం చేసిందో లేదో తెలియదు కాని చేసి ఉంటే ఆ ప్రయత్నం ఫలించలేదని అనుకోవాలి. కాకపోతే అన్ని ఛానళ్లకూ ఈ విషయంలో గురువు టివి9 కాక ఇంకెవరు?
టివి9 నుంచి రవిప్రకాష్ ఉద్వాసన వ్యవహారానికి మిగతా న్యూస్ ఛానళ్లు, ప్రధాన దినపత్రికలు పెద్దఎత్తున కవరేజి ఇవ్వడం బయటనుంచి చూసేవారికి కాస్త ఆశ్చర్యం కలిగించి ఉండాలి. సాటి మీడియా ప్రముఖుడిని ఇంతపెద్ద స్థాయిలో వీధిలోకి ఎందుకు లాగుతున్నారు అన్న ప్రశ్న ఎదురయి ఉండాలి. నిజానికి ఒకచోటి నుంచి వత్తిడి వచ్చి ఉండకపోతే రవిప్రకాష్ అంత కవరేజికి నోచుకునేవాడు కాదు. వత్తిడో, మరొకటోగానీ ఒకసారి కవరేజి మొదలుపెట్టిన తర్వాత ఇక కళ్లెం లేకుండా పోయింది.దశాబ్దానికి పైగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న ఛానల్‌పై మిగతా ఛానళ్లకు ఎంతోకొంత దుగ్ధ ఉండకపోతుందా!
సోషల్ మీడియలో వచ్చిన స్పందనతో పోలిస్తే ప్రధాన స్రవంతి మీడియా కవరేజి అసలు లెక్కలోకే రాదు. టివి9 పరిణామాలు అలా మొదలయ్యాయో లేదో సోషల్ మీడియా ఫెళ్లున బద్దలయింది. అందులో 99 శాతం రవిప్రకాష్‌కు పట్టిన ‘గతి’కి పట్టరాని ఆనందంతో వచ్చిన స్పందనలే. వారివారి మానసిక స్థాయిని బట్టి ఆ స్పందన రూపాంతరం చెందింది.
రవిప్రకాష్ ఇంత వ్యతిరేకత ఎలా మూటకట్టుకోగలిగారు? ఇది ఆయన పట్ల వ్యతిరేకతా, టివి9 పట్ల వ్యతిరేకతా? ఈ పరిణామాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? రవిప్రకాష్ 24 గంటల న్యూస్ ఛానల్ ప్రకటించినపుడు జనం ఇదేం విడ్డూరం అనుకున్నారు. 24 గంటలూ ఏం వార్తలు చూపిస్తారు అన్నారు. ఏం చూపిస్తారో ఛానల్ ప్రసారాలు మొదలయిన తర్వాత తెలిసింది. రవిప్రకాష్ దూడుకుగా చేపట్టిన పోకడలు నలుగురి నోళ్లలో నానడం మొదలుపెట్టాయి. టివి9 అంటే అవినీతిపై ఎక్కుపెట్టిన బాణం అనే భావన చాలామందిలో వచ్చింది. ‘మెరుగైన సమాజం కోసం’ అనే ట్యాగ్‌లైన్ చూసి జనం ముచ్చటపడ్డారు.
ఈ రకమైన పొంగు – ఆ మాటకొస్తే ఏ రకమైన పొంగు అయినా గానీ – ఎల్లకాలం నిలవదు. క్రమేపీ భ్రమలు తొలగడం ప్రారంభమయింది. టివి9 చెప్పేదొకటి చేసేదొకటి అని జనానికి అర్ధమయిపోయింది. టివి9 వెంట పడేది చిన్న చేపలకే పరిమితమనీ, పెద్ద చేపలతో ఆ ఛానల్ భుజంభుజం రాసుకుంటుందనీ తెలిసిపోయింది. టిఆర్‌పి, రేటింగ్‌ల గేమ్ సామాన్య జనానికి కూడా అవగతం అయింది. టివి9కు ఆ రేటింగ్ ఒక్కటే ముఖ్యమనీ, అందుకోసం ఆ ఛానల్ ఉచ్ఛనీచాల మీమాంసను ఏ మాత్రం సంకోచించకుండా పక్కనపెట్టగలదనీ అనుభవం అయింది. రేటింగ్ కోసం ఎవరి వ్యక్తిగత జీవితాలలోకైనా టివి9 తొంగిచూడగలదనీ, ఆ విషయంలో మంచీచెడూ కొంచెం కూడా పాటించదనీ అర్ధమయింది. అనుకున్నదే తడవుగా టివి9 ఎవరినైనా టార్గెట్ చేయగలదనీ, పర్యవసానాలతో నిమిత్తం లేకుండా బట్టకాల్చి నెత్తిన వేయగలదనీ తెలిసిపోయింది. అన్నిటినీ మించి టివి9 స్వయంగా అవినీతికి పాల్పడగలదని అర్ధమయింది. కెమేరా, లోగో చేతబూనిన టివి9 రిపోర్టర్లు (అందరూ కాకపోవచ్చని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు) అవకాశం దొరికిన ప్రతిచోటా అక్రమంగా డబ్బు గుంజటం చూసిన జనం కళ్లు విచ్చుకున్నాయి. టివి9లో మేధోపరమైన లోతు లేనేలేదనీ, అంతా డొల్లతనమేననీ, రేటింగ్ కోసం జుట్టూజుట్టూ ముడివేసి తమాషా చూడడంలో మాత్రమే ఆరితేరిందనీ అర్ధమయింది.
భ్రమలు తొలగేకొద్దీ ఏవగింపు మొదలయింది. ఈలోపు టివి9 స్ఫూర్తితో మరికొన్ని న్యూస్ ఛానళ్లు వచ్చాయి. అవికూడా యధాశక్తి టివి9ను అనుకరిస్తూవచ్చాయి. అన్నీ ఆ తానులో ముక్కలే అని జనానికి అర్ధమయింది(ఒకటీ అరా గౌరవప్రదమైన మినహాయింపులు లేకపోలేదు). కానీ నల్లమందులాగా న్యూస్ ఛానల్ చూడడం అనేది వ్యసనమైపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇరవైకి పైగా న్యూస్ ఛానళ్లు తయారయ్యాయి. దానితో మీడియా స్పేస్ ఇరుకైపోయింది. రాజకీయ ఎజెండాలు మరింత ప్రస్ఫుట రూపం సంతరించుకున్నాయి. తెలుగు వార్తా దృశ్య మాధ్యమంలో ఎటుచూసినా కల్మషమే తయారయింది. అవినీతి కోసమే న్యూస్ ఛానల్ పెడతారన్న వాదు స్థిరపడింది. దానికి టివి9 ప్రతీకగా మారింది. టివి9 అంటే రవిప్రకాషేగా మరి! రవిప్రకాష్ సాధించిన సక్సెస్ ఆయనలో దుడుకుతనాన్ని ఇంకాస్త పెంచింది. ఛానల్ గురించీ, తన గురించీ జనం ఏమనుకుంటున్నదీ తెలిసినా గానీ, ఏ మాత్రం జంకు లేకుండా, ఉత్తమ విలువలకూ, ఉన్నత ఆశయాలకూ, సమాజ శ్రేయస్సుకూ తాను, తన ఛానల్ కట్టుబడి ఉన్నాయని ఏ వేదికపై నుంచి అయినా చెప్పగలిగే స్థితికి ఆయన చేరుకున్నారు. దానితో టివి9 డొల్లతనం మొత్తానికీ జనం రవిప్రకాష్‌నే ప్రతీకగా చూడడం మొదలయింది. నిజానికి టివి9 అనంతరం వచ్చిన న్యూస్ ఛానళ్లు టివి9ను అనుకరించాల్సిన పని లేదు. ప్రొఫెషనల్‌గా, నైతికంగా ఉత్తమ విలువలతో కూడిన జర్నలిజం బాట పట్టకూడదని వారిమీద ఎవరూ వత్తిడి చేయలేదు. కానీ అందరూ టివి9నే అనుకరించడం మొదలుపెట్టారు. ఆ విధంగా చూస్తే తెలుగు టివి న్యూస్ జర్నలిజంలో చెత్తకూ, చెడుకూ అన్ని న్యూస్ ఛానళ్లూ ఉమ్మడిగా బాధ్యత వహించాలి. వాటన్నిటికీ ప్రతీకకగా టివి9నూ, దానికి ప్రతీకగా రవిప్రకాష్‌ను పరిగణిస్తున్నారు కాబట్టి ఆయన ఉద్వాసనకు ఆ విధమైన స్పందన వచ్చింది. నిజానికి ఆ స్పందన ఉమ్మడిగా తెలుగు న్యూస్ ఛానళ్ల పట్ల ప్రజలకున్న ఏహ్యతనూ, వెరపునూ సూచిస్తోంది. అలాఅని అదంతా సోషల్ మీడియా వేదికగా రవిప్రకాష్ నెత్తిన పడడం యాదృచ్ఛికమేమీ కాదు. అది రవిప్రకాష్ కాకుంటే స్పందన ఇంత పదునుగా ఉండేదీ కాదు. సోషల్ మీడియాలో రవిప్రకాష్‌పై పోస్టులు పెట్టిన వారిలో ఎక్కువమంది ఆయనను టివిలో తప్ప చూసి ఉండరు. అది ఆయన తన స్టైల్‌తో కొనితెచ్చుకున్న వైరం. మేడిపండు చందమైన ఒక మీడియా సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తూ స్వచ్ఛమైన వెలుగులు వెదజల్లే సూర్యుడిలా పోజు పెట్టగలిగే స్టైల్. ఆయన రాజీనామా లేఖ మళ్లీ ఒకసారి చూడండి: “నేను నాటిన స్వతంత్ర జర్నలిజం వర్ధిల్లుతుందనీ, సమాజం కోసం పని చేస్తుందనీ ఆశిస్తున్నాను”. స్వతంత్ర జర్నలిజం మొక్కను రవిప్రకాష్ నాటారట! రవిప్రకాష్‌తో పరిచయం లేకుండనే జనం ఆయన లోపలికి చూడగలిగారు. అదీ ఆ స్పందనలో పదునుకు కారణం.

About The Author