కారు డోర్ లాక్ అయి బాలుడి మృతి…


అసలే మండే ఎండలు – ఊపిరాడలేదు..
========================
విశాఖ నగరంలోని తూర్పు నావికాదళ ఉద్యోగుల నివాస ప్రాంతం అమ్జారీ పార్కులో ఓ కారులో ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. ఈ పార్కులో సర్వెంట్‌గా పని చేస్తున్న బంగారి వినోద్‌ తన యజమాని కారును శుభ్రం చేయడానికి తన కుమారుడు ప్రేమ్‌కుమార్‌ (7)తో వెళ్లాడు. ఆ బాలుడు కారులోని బొమ్మలను చూసి ఆడుకుంటానని ముచ్చటపడ్డాడు. వినోద్‌ వారించి బయటకు తీసుకొచ్చేశాడు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కుమారుడిని పక్కనే ఉన్న ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పి అతను బయటకెళ్లాడు. కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. ఆ సమయంలో కారులో ప్రేమ్‌కుమార్‌ పడుకున్నట్టున్నాడని, వెళ్లి చూడమని యజమాని భార్య అతనికి సూచించింది. వినోద్‌ వెళ్లి కారు డోర్‌ తీసి చూసేసరికి ప్రేమ్‌కుమార్‌ కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. తండ్రి బయటకెళ్లాక బాలుడు ఆ కారు డోరు తీసి లోపలికెళ్లాడని, పొరపాటున డోర్‌ లాక్‌ అయి ఊపిరాడక చనిపోయాడని పోలీసులు వివరించారు

About The Author