సూర్యుడి కాంతిలోని విశేషగుణాలు…

పొద్దెక్కేదాకా ముసుగుతన్ని పడుకోవడం ఎంతమాత్రం మంచిది కాదని, సూర్యోదయానికి
ముందే లేవమని మన పెద్దలు పదేపదే చెప్పారు.
తీరిక ఉంటే, అలసట తగ్గకపోతే, మధ్యాహ్నం కాసేపు విశ్రమించవచ్చు కానీ, ఉదయం మట్టుకు పెందలాడే లేవడం మంచి అలవాటు.

సూర్యకాంతి సోకితేనే మనసుకు, శరీరానికీ కూడా హాయిగా ఉంటుంది. ఉల్లాసం, ఉత్సాహం చేకూరుతాయి. ఎప్పుడైనా మబ్బుపట్టి సూర్యుడు కనుక కనిపించకపోతే వాతావరణం మారిపోవడమే కాదు, మనసును కూడా దిగులు మేఘాలు కమ్మినట్టుగా ఉంటుంది.

సూర్యోదయ వేళలో బాలభానుడి కిరణాలు ప్రసరిస్తూ ఉండగా నదిలో స్నానం చేయడం చాలా మంచిది. సాధారణ దినాల్లో నదీ స్నానం వీలు కాకున్నా పర్వదినాల్లో ముఖ్యంగా రథసప్తమి నాడు నదిలో స్నానం చేయడం శ్రేష్ఠం.

సూర్యునికి అత్యంత ప్రియమైంది ఆదిత్యహృదయం. ఉదయం స్నానం చేయగానే ఆదిత్యహృదయం చదవడం శ్రేయస్కరం. మామూలు దినాల్లో ఒకసారి, పర్వదినాల్లో మూడుసార్లు, సూర్యభగవానుని పుట్టినరోజైన రథసప్తమి నాడు పన్నెండుసార్లు ఆదిత్యహృదయం చదవాలి.

పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు (Sun Salutation) చేయడం ఆరోగ్యానికి శ్రేష్టం. ఉదయానే లేవడం, సూర్య నమస్కారాలు చేయడం వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలుసుకుందాం.

సూర్యుడు గనుక లేకపోతే మనకు మనుగడే లేదు. వర్షాకాలంలో రెండురోజులు మబ్బు పట్టిఉంటే లోకమే అంధకార బంధురంగా ఉంటుంది. ఆ సంగతి అలా ఉంచితే, ఉదయానే ప్రసరించే సూర్యకిరణాల్లో ఔషధ గుణాలు ఉంటాయి.

ఉదయానే మనసు, శరీరం తాజాగా ఉంటాయి. దానికి తోడు పొద్దున్నే వచ్చే బాల భానుని కిరణాలు ఆరోగ్యాన్నిమానసిక తేజస్సును ఇస్తాయి.
సూర్యుని వేడిమికి హాని చేసే క్రిమి కీటకాలు నశిస్తాయి. దాంతో వైరల్ ఫీవర్లు, అంటు వ్యాధులు రావు.

ఉదయ కిరణాల్లో విటమిన్ ఏ, డీ పుష్కలంగా ఉంటాయి. పొద్దున్నే కాసేపు సూర్యకాంతిని చూట్టంవల్ల కళ్ళకు మంచిది. కంటి వ్యాధులు, దోషాలు ఏమైనా ఉంటే తగ్గుతాయి.

సూర్య కిరణాలు శరీరంపై ప్రసరించడంవల్ల చర్మ వ్యాధులు రావు. నరాలు బలహీన పడవు. గుండె జబ్బులు తగ్గుతాయి.
ప్రకృతి వైద్యంలో రోజులో కొంతసేపు తప్పకుండా ఎండలో కూర్చోబెడతారు. అలాగే రంగు సీసాల్లో నీళ్ళు పోసి, వాటిని ఎండలో ఉంచి, ఆ నీటిని తాగిస్తారు. అలా సూర్యకిరణాలు ప్రసరించిన నీరు శరీరానికి హితవు చేస్తుందని చెప్తారు.

ఎండలో ధాన్యపు గింజలను రెండుమూడు రోజులపాటు ఎండపెట్టినట్లయితే అవి పుచ్చిపోకుండా ఉంటాయి.
పత్రహరితం తయారవడానికి సూర్యరశ్మి అవసరం. ఏ రకంగా చూసినా సూర్యుడు లేనిదే మనుగడే లేదు.

About The Author