మమతకు షాక్.. బీజేపీలోకి ఎమ్మెల్యేల క్యూ..
పశ్చిమబెంగాల్‌లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ చవిచూసిన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు.
తాజాగా టీఎంసీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం షురూ అయింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతర నేపథ్యంలో టీఎంసీకి చెందిన ముగ్గురు ఎమ్మేల్యులు బీజేపీ తీర్ధం తీసుకునేందుకు సోమవారంనాడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
వీరిలో ఇటీవలే టీఎంసీకి ఉద్వాసన చెప్పి బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ తనయుడు సుభాన్షు రాయ్, మరో ఇద్దరు టీఎంసీ నేతలు ఉన్నారు.
కాగా, ఇప్పటికే సుభాన్షు రాయ్‌ని పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆరేళ్ల పాటు టీఎంసీ సస్పెండ్ చేసింది.
పశ్చిమబెంగాల్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వేగంగా సమీకరణలు మారుతున్నాయని, సుమారు 100 మంది టీఎంసీ నేతలు బీజేపీతో మంతనాలు సాగిస్తున్నారని, ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మీడియాకు తెలిపారు.