జూన్ 7న ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం…


ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30 గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన తన మంత్రి వర్గాన్ని జూన్ 7 న విస్తరించే అవకాశంఉంది. ఇందుకోసం ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. మంత్రివర్గ ఆమోదంతోనే శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు జగన్ నిర్ణయించారు. ఈవిషయమై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో శాసనసభ అధికారులు చర్చించారు. కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం జూన్ 11 లేదా 12న అసెంబ్లీని సమావేశ పరిచే అవకాశం ఉంది.

కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే శాసనసభ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. జూన్ నెలాఖరుతో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ గడువు ముగియనున్నందున జూన్ నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. మరోవైపు జగన్ జూన్ 3 నుంచి 6 వరకు సెక్రటేరియేట్ లో ముఖ్యమంత్రి హోదాలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సెక్రటేరియేట్ మొదటి బ్లాకులో ఇప్పటికే సీఎం కార్యాలయం సిధ్దం అవుతోంది. సీనియర్ వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి బుధవారం సెక్రటేరియేట్కు వచ్చి సీఎం ఛాంబర్ లో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

About The Author