నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సమరం మూడు జిల్లాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల ఢీ


నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సమరం
మూడు జిల్లాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల ఢీ
రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా పోరు
మెజారిటీపై తెరాస ఆశలు
గట్టి పోటీపై కాంగ్రెస్‌ ధీమా
2799 మంది ఓటర్లు, 25 పోలింగు కేంద్రాలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సమరానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెరాస, కాంగ్రెస్‌ పార్టీలు ఈ మూడు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి.
2016లో జరిగిన ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా పట్నం నరేందర్‌రెడ్డి, వరంగల్‌ నుంచి కొండా మురళి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు గెలిచారు. గత శాసనసభ ఎన్నికల్లో నరేందర్‌రెడ్డి కొడంగల్‌ నుంచి, రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. కొండా మురళి వ్యక్తిగత కారణాలతో రాజీనామా సమర్పించడంతో తాజాగా వీటికి ఎన్నికలను నిర్వహిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి తెరాస అభ్యర్థి కాగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌ తరఫున, వరంగల్‌ జిల్లాలో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (తెరాస) ఇనుగాల వెంకట్రామిరెడ్డి (కాంగ్రెస్‌), నల్గొండలో తేరా చిన్నపరెడ్డి (తెరాస) కోమటిరెడ్డి లక్ష్మి (కాంగ్రెస్‌) బరిలో ఉన్నారు.

పార్టీల ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎన్నికల్లో గుర్తులుండవు. అభ్యర్థుల ఫొటోలు ఉంటాయి. అంకెల ప్రాతిపదికన ఓట్లు వేయాలి. ఎన్నికల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిసి మొత్తం 2799 మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 25 పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అందరి దృష్టి వీటిపై కేంద్రీకృతమైంది. మూడు జిల్లాల్లో తెరాసకు ఆధిక్యం ఉన్నా కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఉంది.

తెరాస వ్యూహం
పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన వాటిలో ఏడు స్థానాలు దక్కకపోవడం తెరాసను కొంత నిరాశ పరిచింది. మళ్లీ పుంజుకునేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను ఉపయోగించుకునేందుకు వ్యూహం పన్నింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు అప్పగించారు. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో జిల్లాకు ముగ్గురేసి మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ ఇలా ప్రతి ఒక్కరినీ కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కొన్నిచోట్ల శిబిరాలు నిర్వహించారు. తెరాస గెలుపు అవసరాన్ని కేటీఆర్‌ స్వయంగా అందరికీ వివరించారు. తెరాస అంచనా ప్రకారం రంగారెడ్డి జిల్లాలో 650, నల్గొండ 730, వరంగల్‌ జిల్లాలో 742 ఓట్ల బలం ఉంది. పూర్తి స్థాయిలో మెజారిటీ ఓట్లు తమకు ఉన్నందున వాటిని సాధించి తద్వారా విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి ఎదురైందున ఈసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులను తెరాస అధిష్ఠానం అప్రమత్తం చేసింది.

కాంగ్రెస్‌ సన్నద్ధం
మూడు శాసనమండలి స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమైంది. మూడు జిల్లాల్లో అభ్యర్థుల తరఫున పార్టీ ముఖ్యనేతలు ప్రచారం చేశారు. నల్గొండ గతంలో గెలిచిన స్థానం అయినందున దీనిపై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లోనూ గట్టి పోటీ ఇచ్చేందుకు యత్నిస్తోంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆ పార్టీ నేతలు సంప్రదించారు. నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికను పార్టీ నేతలు కోమటిరెడ్డి సోదరులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నల్గొండ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ఆయన సతీమణి లక్ష్మిని బరిలో దించారు. గతంలో రాజగోపాల్‌రెడ్డికి ఓట్లు వేసిన వారే ఈసారి కూడా ఓటర్లుగా ఉన్నారు. గతంలో ఆయన నెగ్గినా తదనంతర పరిణామాల నేపథ్యంలో పలువురు తెరాసకు మద్దతు పలికారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ తరఫున గతంలో గెలిచిన వారితో పాటు ఇతర ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నల్గొండతో పాటు వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లోని సభ్యులతో కాంగ్రెస్‌ శిబిరాలు నిర్వహించింది.

About The Author