బ్రహ్మచారులకు వల .. అమ్మాయి చాటింగ్ లో విలవిల …
పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న యువకులకు వల విసురుతుంది. మాయమాటలతో దగ్గరవుతుంది. పెళ్లి చేసుకుందామంటూ నమ్మిస్తుంది. కష్టాల కథలు చెప్పి అందినంత కాజేసి, అవసరం తీరాక మొహం చాటేస్తుంది. ఇలా ఆ కిలాడీ యువతి వలలో చిక్కుకున్న యువకులు 17 మంది. బాధిత యువకులు కొందరు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మాయలేడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తమిళనాడులోని కడలూరు జిల్లా వలయామదేవి ప్రాంతానికి చెందిన ఎంబీఏ పట్టభద్రుడైన బాలమురుగన్ (33) అనే బంగారు నగల వ్యాపారి తన వివాహం కోసం కొన్నేళ్ల క్రితం మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పేరు, వివరాలు నమోదు చేశాడు.
సేలం జిల్లా ఆట్టయంపట్టి సమీపం మరుమలయంపాళెంకు చెందిన 25 ఏళ్ల యువతి అతడిని సంప్రదించి 2016 సెప్టెంబరు నుంచి పరిచయం పెంచుకుంది. పెళ్లి చేసుకుందామని నమ్మించింది. తన కుటుంబ కష్టాలు, అవసరాలు చెప్పుకుంటూ డబ్బులు, ఇంటికి కావాల్సిన వస్తువులను అతడి ద్వారా పొందేది. ఇలా రూ.23 లక్షల వరకూ యువతికి సమర్పించుకున్నాడు. ఆ తరువాత క్రమేణా అతనితో మాట్లాడడం తగ్గిస్తూ వచ్చింది. ఈ క్రమంలో యువతి ఇంటికి వెళ్లినపుడు ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలించగా చాలామంది యువకులతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, అసభ్యంగా తీసుకున్న సెల్ఫీలు, ప్రేమ ముసుగులో అసభ్య చాటింగులు, ఎస్‌ఎంఎస్‌లు చూసి మోసపోయినట్లు తెలుసుకున్నాడు.
తానిచ్చిన డబ్బు, నగలు తిరిగి పొందేందుకు సేలంకు చెందిన రాజా అనే వ్యక్తి ద్వారా సంప్రదించగా అతడు కూడా యువతితో చేరిపోయి బాలమురుగన్‌తో బలవంతంగా ఆమె మెడలో తాళి కట్టించి ఫొటోలు తీసి వెళ్లగొట్టారు. తరువాత ఆ దృశ్యాలను చూపుతూ మరికొన్ని లక్షలు ఇవ్వాల్సిందిగా హత్యా బెదిరింపులకు పాల్పడ్డారని బాలమురుగన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించడంతో సదరు కిలాడీ లేడీ పారిపోయింది. పోలీసుల ప్రాథమిక విచారణలో బాలమురుగన్ తరహాలోనే కోయంబత్తూరు, మదురై, చెన్నై, తిరుచ్చిరాపల్లి ప్రాంతాలకు చెందిన 17 మంది యువకులను మోసగించి రూ.85 లక్షల వరకు కాజేసినట్లు తేలింది.