మూడున్నర కిలోల మామిడికాయ..
సాధారణంగా మామిడికాయ వంద గ్రాముల నుంచి కిలో వరకు బరువు ఉంటుంది. కొన్నిరకాలైతే కిలో నుంచి రెండు కిలోల వరకు కూడా బరువు తూగుతాయి. ఏపీలోని తూర్పుగోదావరిజిల్లా ఆలమూరు మండలంలోని మడికి కూరగాయల మార్కెట్లో శుక్రవారం మూడున్నర కిలోల బరువున్న మామిడికాయ దర్శనమిచ్చింది. రాజానగరం మండలం తుంగపాడుకు చెందిన మామిడి రైతు కొత్తపల్లి శ్రీను తెచ్చిన కాయల్లో ఇది ఉంది. ఇది ఏనుగుతొండంగా పిలిచే మామిడి రకానికి చెందింది. ఈ తరహా కాయలు కిలో నుంచి కిలోన్నర వరకు బరువు ఉంటాయి. ఈ భారీ మామిడి కాయను రూ.200కు స్థానికుడొకరు కొనుగోలు చేశారు. మామిడికాయ ఇంత బరువైనది కాయడం అరుదైన విషయమని రాజమహేంద్రవరం ఉద్యానవనశాఖ ఏడీ ఆర్.దేవానందకుమార్ పేర్కొన్నారు.