బీజేపీలోకి భారీగా చేరికలు.. టీడీపీ, జనసేన నేతలు క్యూ…
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీ భారీ మెజార్టీతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల ఫలితాలొచ్చి పదిరోజులు కూడా సరిగ్గా పూర్తిగాక మునుపే నేతలు జంపింగ్‌లు షురూ చేశారు. గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల నుంచి భారీగా బీజేపీలో చేరికలు జరిగాయి. బీజేపీ నేత ఏపూరి రామయ్య నేతృత్వంలో పెద్ద ఎత్తున నేతలు కండువాలు కప్పుకున్నారు. ముఖ్యంగా గురజాల, మాచర్ల నియోజకవర్గం నుంచి మండల, గ్రామ స్థాయి నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేతలందరికీ.. కండువాలు కప్పి పార్టీలోకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆహ్వానించారు.
వైసీపీ ట్రాప్‌లో పడవద్దని చెప్పాం..!
కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ..2019లో దేశం అంతా అభివృద్ధికి కాంక్షిస్తూ తిరిగి మోదీకే పట్టం కట్టారన్నారు. ఎవ్వరి అంచనాలకు అందకుండా 300 పైగా స్థానాల్లో ప్రజలు గెలిపించారని ఆయన చెప్పుకొచ్చారు. “2014 లో రాష్ట్ర విభజన ఆగదని తెలిసి ప్రజలను మభ్యపెట్టారు. నేడు హోదా విషయంలో కూడా ప్రజలను మభ్య పెడుతున్నారు. వైసీపీ ట్రాప్‌లో పడవద్దని బాబుకి చెప్పాం. ఏపీలో బాబుతో పొత్తు పెట్టుకుని బీజేపీ బాగా నష్ట పోయింది. బాబు మనతో లేకపోయినా.. ఏపీ ప్రజలు మనకు ముఖ్యమని మోదీ అండగా నిలిచారు. కేంద్రం నుంచి అన్ని విదాలుగా బాబు లబ్ది పొంది బీజేపీపై దుష్పప్రచారం చేశారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరేందుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు” అని కన్నా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.