కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.

కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా ఈ ఏడాదే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నింపుతామని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందుకోసం జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద నిర్మిస్తున్న పంపుహౌజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పనులను ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం పరశీలించారు. రాంపూర్ వద్ద నిర్మిస్తున్న ఎనిమిది పంపు హౌజ్ పనులను సందర్శించారు. పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న లక్ష్మీపూర్ పంపు హౌజ్ ద్వారా వరద కాలువ నుండి శ్రీరాంసాగర్ ప్రాజేక్టుకు రివర్స్ పంపింగ్ ద్వారా నీరందించాలని ముఖ్యమంత్రి గతంలో నిర్ణయించి ఎస్.ఆర్.ఎస్.పీ పునరజ్జీవ పథకం చేపట్టారు. మేడిగడ్డ, సుందిళ్ల్ల, అన్నారం బ్యారేజీల ద్వారా లక్ష్మీపూర్ నుండి రాంపూర్ వరకు చేరుకునే నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువ నుంచి ఎస్ఆర్ఎస్పీకి పంపుతారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి అత్యంత కీలకమైన రాంపూర్ పంపుహౌజ్ నిర్మాణం పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేరూలని సీఎం అన్నారు. ఈ ఏడాది జూలై నుండే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నందున అటు మిడ్ మానేరుకు, ఇటు ఎస్ఆర్ఎస్పీకి నీటి పంపింగ్ జరగాలన్నారు. నెల రోజుల్లో రాంపూర్ పంపు హౌజ్ లోని ఎనిమిది పంపుల్లో అయిదు పంపులను సిద్ధం చేయాలని, ఆగష్టు నాటికి మిగిలిని మూడు పంపులను సిద్ధం చేయాలన్నారు. దీనికి అవసరమైన విద్యుత్ సరఫరా ఏర్పాట్లు కూడా చూసుసకోవాలని చెప్పారు. గోదావరిలో అక్టోబర్, నవంబర్ నెలల వరకు కూడా నీటి ప్రవాహం ఉంటుంది కాబట్టీ ఆ సమయం వరకు ఎస్ఆర్ఎస్పీకీ నీటి పంపింగ్ జరుగుతూనే వుండాలని సిఎం చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రెండో పంటకు ఈ ఏడాదే నుండే నీరు అందించడం లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. సిబ్బందిని ఎక్కువ మందిని పెట్టుకుని రేయింబవళ్లు పనిచేసి లక్ష్యం సాధించాలని వర్క్ ఏజేన్సీలకు సూచించారు.

‘‘తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు కోటీ ఆశలతో కాళేశ్వరం నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల తరబడి అనుభవించిన సాగునీటి కష్టాలకు తెరపడుతుందని నమ్మకంతో వున్నారు. రైతులకు సాగునీరందించడమే ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నది. కోటికి పైగా ఎకరాలకు సాగునీరందించేందుకు పాలమురు-రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ ఎత్తపోతల పథకాలను నిర్మిస్తున్నది. వీటిలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. దాదాపు 80శాతం జిల్లాలకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరందించే బృహత్తర ప్రాజెక్టు ఇది. ఒక్కసారి ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. అందుకే ప్రభుత్వం ఎక్కడా నిధుల కొరత రాకుండా, భూసేకరణ సమస్య లేకుండా, విధాన నిర్ణయాల్లో జాప్యం జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నది. దాని ఫలితంగానే ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. కాళేశ్వరం లాంటి అతి పెద్ద ప్రాజెక్టు నిర్మాణానికి 15-20 ఎండ్లు పడుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్ల అతి తక్కువ సమయంలోనే ప్రధానమైన బ్యారేజీలు పంపుహౌజ్ లు నిర్మించి గోదావరి నీటిని ఎత్తి పంట పొలాలకు తరలించనున్నది. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతం. వచ్చే నెల నుండే నీటి పంపింగ్ ప్రారంభించాల్సి వున్నందున అధికారులు, ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలి. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఎంత పట్టుదలతో వుందో గ్రహించి అధికారులు, వర్క్ ఏజెన్సీలు కూడా ప్రాణం పెట్టి పనిచేయాలి. చివరి దశలో మరింత అప్రమత్తంగా వుండాలి. ఒక సారి నీటి పంపింగ్ ప్రారంభమయితే కొన్ని బాలారిష్టాలు (Teething problems) ఎదురవుడం సహజం. వాటిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ప్రాజెక్టును పట్టిష్టంగా నిర్వహించాలి. ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో దానిని నిర్వహించడం కూడా అంతే ముఖ్యం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

సీఎం వెంట మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్థి, ప్రభుత్వ విప్ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎంపీ శ్రీ జె. సంతోష్ కుమార్, ఎంఎల్సీ శ్రీ శేరి సుభాష్ రెడ్డి, జడ్పి చైర్ పర్సన్ శ్రీమతి తుల ఉమ, ఐడిసి చైర్మన్ శ్రీ ఈద శంకర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఇఎన్సీ శ్రీ మురళిధర్ రావు, సలహాదారు శ్రీ పెంటారెడ్డి, సీఎం కార్యదర్శి శ్రీమతి స్మితా సభర్వాల్, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ రాజేశం గౌడ్ తదితరులు వున్నారు.

About The Author