కిడ్నీ కొంటాం – 3 కోట్లు ఇస్తాం…
కిడ్నీ కొంటాం – 3 కోట్లు ఇస్తాం….
రిజిస్ట్రేషన్ కు 25 వేలు అంటూ కోట్లు కొట్టేసి పరార్…
డబ్బు కోసం ఎంతకైనా తెగించే కిడ్నీ మాఫియా హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని రూ.కోట్లు కాజేస్తున్న వైనం వెలుగుచూసింది. ఐదు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 500 మందికి పైగా వ్యక్తులు ఈ మాఫియా చేతిలో మోసపోయినట్లు ఏపీకి చెందిన ఒక మహిళ వల్ల మంగళవారం తమిళనాడులో బయటపడింది. ఈరోడ్ సంపత్‌నగర్‌లో కల్యాణి కిడ్నీకేర్ ఆస్పత్రి పేరున ఈ మాఫియా ఫేస్‌బుక్‌లో ఆకర్షణీయమైన ప్రకటనను పొందుపరిచింది. ఒక్కో కిడ్నీని రూ.3 కోట్లకు కొనుగోలు చేస్తాం. కిడ్నీని అమ్మదలిచినవారు ఈ చిరునామాలో తమ వివరాలను నమోదు చేసుకుంటే అవసరమైనపుడు పిలుస్తామని పేర్కొన్నారు. అయితే నమోదు సమయంలో కిడ్నీ ఇవ్వదలిచిన వారు అడ్వాన్సుగా రూ.15వేల నుంచి రూ.25వేలు చెల్లించాల్సి ఉంటుందని నిబంధన పెట్టారు.
ఒక్క కిడ్నీకి రూ.3 కోట్లు లభిస్తుందన్న ఆశతో తమిళనాడులోని ఈరోడ్, సేలం, కోయంబత్తూరు, నామక్కల్, తిరుచ్చిరాపల్లి, కరూరు జిల్లాలవారేగాక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వందలాది మంది ఆ ఫేస్‌బుక్ గ్రూపులో సభ్యులుగా చేరి అడ్వా న్సు రుసుము చెల్లించారు. కిడ్నీ అమ్మకం కోసం అడ్వాన్సు చెల్లించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ మంగళవారం ఈరోడ్‌లోని కల్యాణీ కిడ్నీకేర్ సెంటర్‌ను సంప్రదించడంతో ఆస్పత్రి నిర్వాహకులు భయాందోళనకు గురయ్యారు. తమ ఆస్పత్రి పేరున నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు తెలుసుకుని ఈరోడ్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శక్తిగణేశన్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఇది నడిచినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కిడ్నీ మాఫియా గురించి హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు.