తెరాసలో సీఎల్పీ విలీనం పూర్తి…
హైదరాబాద్: కాంగ్రెస్ శానసభాపక్షం తెరాసలో విలీనం పూర్తయింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ శాసనసభ సచివాలయం జారీ చేసింది. తెరాసలో సీఎల్పీ విలీనం ప్రక్రియ పూర్తైనట్లు అందులో పేర్కొంది. సీఎల్పీని తెరాసలో విలీనం చేయాలని కోరుతూ హస్తం గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి లేఖ అందించారు. ఈ మేరకు విలీనం ప్రక్రియను పూర్తయింది. సీఎల్పీ విలీనంపై శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు బులిటెన్ విడుదల చేశారు. దీంతో శాసనసభలో తెరాస బలం 102కి చేరింది. ఆరు స్థానాలకు కాంగ్రెస్ సభ్యుల సంఖ్య పడిపోయింది. ప్రస్తుతం ఏడు స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం అవతరించింది.
ముగిసిన విలీన ప్రక్రియ… ప్రతిపక్షమే లేని తెలంగాణ అసెంబ్లీ… అందరూ అస్మదీయులే…
టిఆర్ఎస్లో సీఎల్పీ విలీనం సంపూర్ణమైంది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం అయినట్టు శాసనసభ సచివాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యలు ప్రత్యేక బులెటెన్ విడుదల చేశారు.
నేటి మధ్యాహ్నం, కాంగ్రెస్ గుర్తుపై గెలిచి, అధకార టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న 12 మంది ఎమ్మెల్యేలు సభాపతిన, పోచారం శ్రీనివాసరెడ్డి ని కలిసి సీఎల్పీని టిఆర్ఎస్లో విలీనం చేయాలని విజ్ఞప్తిచేశారు.
మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఎల్లారెడ్డి నుంచి జాజుల సురేందర్, పినపాక నుంచి రేగ కాంతారావు, పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డి, ఇల్లందు నుంచి హరిప్రియ, కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వర రావు, నకిరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్య, ఎల్బీనగర్ నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు, కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి టిఆర్ఎస్లో చేరినట్టు ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది టిఆర్ఎస్ శాసనసభాపక్షంలో చేరాలని నిర్ణయించుకున్నందున తమను ఆ పార్టీలో విలీనం చేయాలని
12మంది ఎమ్మెల్యే ల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్‌కు ఆయన నివాసంలో నేటి మధ్యహ్నం అందచేసారు.
టిఆర్ఎస్ శాసనసభాపక్ష నేత కూడా ఆ 12 మందినీ విలీనం చేసుకొనేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని స్పీకర్ కు తెలియచేయడంతో…. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలనూ టిఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
స్పీకర్ నిర్ణయంతో సభలో టీఆర్ఎస్ బలం 102 కు చేరుకోగా… కాంగ్రెస్ బలం 6కి పడిపోయింది, తమ సభ్యుల సంఖ్య 6కి పడిపోడంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది.
తెలంగాణ అసెంబ్లీలో ఏడుగురు సభ్యులతో రెండవ అతిపెద్ద పార్టీగా ఎంఐఎం నిలిచింది.