పరిశ్రమల హబ్.. దండుమల్కాపురం…


-400 పరిశ్రమలు.. రూ.1,200 కోట్ల పెట్టుబడులు..
-వేగంగా టీఐఎఫ్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు పనులు
-ప్రత్యక్షంగా 15 వేలు, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి..
-ఎమ్మెస్‌ఎంఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం
-డిసెంబర్ చివరినాటికి పారిశ్రామిక ఉత్పత్తి ప్రారంభం..
-రూ.210 కోట్లతో టీఐఎఫ్, టీఎస్‌ఐఐసీ వసతులు

ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కొత్త పరిశ్రమలను ఆకర్షించడంతోపాటు ఉన్న పరిశ్రమల విస్తరణకు ప్రోత్సాహకాలు అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనా సంస్థ (టీఎస్‌ఐఐసీ) ద్వారా ఒక్కో రంగానికి సంబంధించిన పరిశ్రమలను ఒక్కోప్రాంతంలో ఏర్పాటుచేస్తున్నది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) ద్వారా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇందుకు 377 ఎకరాలకు ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి దండుమల్కాపురం టెక్స్‌టైల్ పార్కును ఆనుకుని కిలోమీటరున్నర లోపల ఈ పార్కుకు స్థలాన్ని కేటాయించారు.

ఇక్కడ మొత్తం 400 ఎమ్మెఎస్‌ఎంఈ పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. వీటిద్వారా రూ. 1,200 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 15 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆయా పరిశ్రమలకు స్థలాల కేటాయింపు పూర్తయింది. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్ పనులు యుద్ధ్దప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి ఇక్కడ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించనున్నాయి. ఎగుమతిచేసే స్థాయి ప్రమాణాలున్న వస్తు ఉత్పత్తుల పరిశ్రమలతోపాటు రక్షణ, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్, ప్యాకేజింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలను ఇక్కడ స్థాపిస్తారు. డ్రిల్లింగ్ యంత్రసామగ్రి, వాటర్ డ్రిల్లింగ్, గనుల డ్రిల్లింగ్‌లో ఉపయోగించే యంత్రాలు, పరికరాలను ఇక్కడ తయారుచేస్తారు.

టీఎస్‌ఐఐసీ రూ.35 కోట్లు
ఇండస్ట్రియల్ పార్కుకు అవసరమైన మౌలిక సదుపాయాలను టీఎస్‌ఐఐసీ కల్పిస్తున్నది. జాతీయ రహదారి నుంచి పార్కు వరకు కిలోమీటరున్నర రోడ్డు వేశారు. 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి వసతిని కల్పిస్తున్నారు. వీటన్నింటికి రూ.35 కోట్లు వెచ్చిస్తున్నది. ఇక్కడ పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు సదుపాయాలు కల్పించడానికి టీఐఎఫ్ ప్రాధాన్యం ఇస్తున్నది. కార్మికులు, ఉద్యోగుల కోసం క్యాంటీన్, సర్వీసు అపార్ట్‌మెంట్లు, అతిథిగృహం, రిక్రియేషన్ సెంటర్, బ్యాంకు, ఏటీఎంలను, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. డుమల్కాపురంతోపాటుగా సమీప గ్రామాల్లో అర్హత, ఆసక్తి కలిగిన వారికి శిక్షణ ఇచ్చి ఇక్కడి కంపెనీల్లో నియమించుకుంటారు. ఉద్యోగులు, కార్మికులకు ఆరోగ్య సమస్యలు వస్తే అత్యవసర సమయాల్లో చికిత్సను అందించడానికి అం బులెన్స్, ప్రాథమిక వైద్య కేంద్రం అందుబాటులో ఉంచుతారు. టీఎస్‌ఐపాస్ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేస్తారు.

హరితానికి ప్రాధాన్యం
పరిశ్రమలు అంటేనే కాలుష్యమనే భావనను ప్రజల్లో తొలిగించడానికి ఇక్కడ వైట్, గ్రీన్ క్యాటగిరీల పరిశ్రమలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. తద్వారా ఇక్కడ కాలుష్య ప్రభావం ఉండదు. వచ్చే జూలైలో రోడ్లకు ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రతి పరిశ్రమకు కేటాయించిన స్థలంలో 30 శాతం గ్రీనరీ పెంచాల్సి ఉంటుం ది. ప్రధానరోడ్లు 100 ఫీట్లు, మిగిలిన రోడ్లు 80 ఫీట్లు, 60 ఫీట్లలో నిర్మిస్తున్నారు. వర్షపు నీరు పోవడానికి వీలుగా కల్వర్టులను నిర్మిస్తున్నారు. మురుగునీటి శుద్ధికి సీవరేజ్ ట్రిట్‌మెంట్ ప్లాంటు ఏర్పాటుచేయనున్నారు. మొత్తం పార్కు స్థలంలో 40 ఎకరాలను గ్రీనరీ కోసం వదిలిపెడుతున్నారు.

ఇండ్ల్ల స్థలాల ప్రతిపాదన
కార్మికులు, ఉద్యోగుల కోసం పారిశ్రామిక ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీఎం కేసీఆర్ గతంలోనే నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పారిశ్రామిక పార్కులను నగరం అవతలికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ముందుకొచ్చిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పారిశ్రామిక పార్కు సమీపంలోనే ఇండ్ల స్థలాలు కేటాయిస్తారు. టీఐఎఫ్ పార్కులో పక్కనే దాదాపుగా 194 ఎకరాలను కార్మికులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని టీఐఎఫ్ కోరింది. దీనికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అధికారికంగా కేటాయింపులు జరుగాల్సి ఉంది. ఈ పార్కుకు త్వరలో ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) హోదా రానుంది. దీనిద్వారా పారిశ్రామికవాడల్లో నిర్మించే భవనాలకు ఐలా కమిషనర్ స్థాయిలో అనుమతులు ఇచ్చే అవకాశం ఉంటుంది.

మౌలిక సదుపాయాల కోసం రూ. 175 కోట్లు
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో మౌలిక సదుపాయాలు, భూమి కొనుగోలు వంటి వాటికి రూ.175 కోట్ల వరకు టీఐఎఫ్ వెచ్చిస్తున్నది. ఇక్కడ పరిశ్రమల స్థాపించే వారందరు ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో కార్మికులు ఇక్కడ పనులు చేస్తున్నారు. పార్కుకు అవసరమైన పర్యావరణ అనుమతులు ఇప్పటికే వచ్చాయి. అక్టోబర్ చివరి నాటికి మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జూలైకల్లా పరిశ్రమల యజమానులు భవన నిర్మాణాలు ప్రారంభించేందుకు వీలుగా ఏర్పాట్లుచేస్తున్నారు. కొందరు ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించారు. పరిశ్రమల విస్తరణకు వీలుగా మరో 120 ఎకరాల వరకు భూ సేకరణ పూర్తయింది. ఈ స్థలాన్ని కూడా టీఎస్‌ఐఐసీ టీఐఎఫ్‌కు కేటాయించనుంది. మరికొన్ని పరిశ్రమలు అదనంగా రానున్నాయి.

ఆదర్శపార్కుగా తీర్చిదిద్దుతాం
తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్యకు స్థలాన్ని కేటాయించింది. ఎమ్మెస్‌ఎంఈ పరిశ్రమలకు స్థలాన్ని కేటాయించాలని అడగ్గానే సీఎం కేసీఆర్, అప్పటి పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు కేటాయించారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ పార్కు ను ఆదర్శపార్కుగా తీర్చిదిద్దడానికి టీఎస్‌ఐఐసీ సహకారంతో చర్యలు తీసుకుంటున్నాం. ఈ పార్కు ద్వారా ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. స్థానికుల ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం. పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
– కే సుధీర్‌రెడ్డి, టీఐఎఫ్ అధ్యక్షుడు

ఎమ్మెస్‌ఎంఈ రంగానికి ప్రోత్సాహం
తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెస్‌ఎంఈ పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టీఐఎఫ్ కు స్థలం కేటాయించింది. ఇక్కడ మౌలిక సదుపాయాలను టీఎస్‌ఐఐసీ కల్పిస్తున్నది. ఒక్కో రం గానికి ప్రత్యేక పార్కుల్లో దండుమల్కాపురం పార్క్ ప్రారంభం మాత్రమే. భవిష్యత్‌లో మరిన్ని ప్రారంభిస్తాం. ఇందుకు అవసరమైన స్థలాలను గుర్తించాం. సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్కు, మహంకాళ్‌లో ప్లాస్టిక్ పార్కు, బండ తిమ్మాపూర్‌లో ఫుడ్‌పార్క్, బండమైలారంలో సీడ్‌పార్క్, ఇబ్రహీంపట్నంలో కాంపాజిట్స్ మ్యానుఫాక్చరింగ్ పార్క్ ప నులు జరుగుతున్నాయి. వీటిలో కూడా ఎమ్మెస్‌ఎంఈ రంగానికి 30 శాతం స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం విధానపరంగా నిర్ణయించింది. మహిళలకు ప్రత్యే క పార్కులను ఏర్పాటుచేస్తున్నాం.
– ఈ వెంకట నర్సింహారెడ్డి, ఎండీ, టీఎస్‌ఐఐసీ

About The Author