రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్లాలి…టీడీపీ..

?కొత్త ప్రభుత్వానికి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సూచన

రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్లాలని కొత్త ప్రభుత్వానికి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. రైతు రుణమాఫీ 4, 5వ విడతలు చెల్లించడం ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్నారు. 10శాతం వడ్డీతో సహా రైతులకు ఇచ్చిన బాండ్లను గౌరవించాలన్నారు. భవిష్యత్తు ఉందంటేనే ఎవరైనా రాష్ట్రానికి వస్తారని, పెట్టుబడులు పెడతారని చంద్రబాబు చెప్పారు. అవగాహన లేకుండా పోవడం, చెప్పుడు మాటలు వినడం, టీడీపీపై బురదజల్లడమే వైసీపీ త్రిసూత్రంగా పెట్టుకుందని చంద్రబాబు విమర్శించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలనుద్దేశించిమాట్లాడిన చంద్రబాబు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేతల నాయకత్వ సామర్థ్యం బయటపడుతుందన్నారు.
అసెంబ్లీలో తన కంటే మిగతావారి వాయిస్ ఎక్కువగా వినబడాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ, ప్రజల పట్ల బాధ్యత తూచా తప్పకుండా నిర్వర్తించాలన్నారు. సమస్యల పరిష్కారంపై టీడీపీ పోరాట పటిమ ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఇదిలాఉండగా.. టీడీపీ కార్యకర్తలు, నేతలపై దాడులను, దౌర్జన్యాలను ఖండిస్తూ టీడీఎల్పీ తీర్మానం చేసింది. కార్యకర్తల రక్షణ కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కార్యకర్తల రక్షణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. ఈనెల 15న జరిగే పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని తీర్మానించారు.
కార్యకర్తల్లో, నాయకుల్లో ఆత్మవిశ్వాసం పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు, దౌర్జన్యాలు గర్హనీయం అన్నారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలో ఎప్పుడేం జరుగుతుందో సమాచారం నేరుగా చెప్పాలని నేతలకు సూచించారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం పట్టుదలతో పోరాడుదామని పిలుపునిచ్చారు. హక్కుల సాధనే టీడీపీ లక్ష్యం అని, పేదల సంక్షేమమే మనందరి ధ్యేయం అని పేర్కొన్నారు. గత 37 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. ఎన్టీఆర్ హయాంలో, ఆ తర్వాత అనేక అవమానాలు భరించామని, ప్రజల అండదండలతోనే అన్నింటిని తట్టుకుని నిలబడ్డామని చెప్పుకొచ్చారు.

About The Author