ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అవినీతిపై సర్జికల్ స్ట్రయిక్…


ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అవినీతిపై సర్జికల్ స్ట్రయిక్ ప్రారంభించారు. అవినీతి ప్రక్షాళనలో భాగంగా మోదీ 2.0 సర్కార్ దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఏళ్ల తరబడి పలు శాఖల్లో వేళ్లూనుకుపోయిన అవినీతి అధికార యంత్రాంగంపై మోదీ దృష్టిసారించినట్టు తెలుస్తోంది.

అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తూ.. యూపీఏ కాలం నుంచి రాజకీయ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న కొందరు అధికారుల గుండెల్లో మోదీ రైళ్లు పరుగెట్టిస్తున్నారు. ఐటీ, ఆర్థికశాఖల్లో కొందరు అవినీతి జలగలు, కీచకుల చిట్టా బయటపడటంతో.. ఆ శాఖల్లోని 12 మంది అవినీతి అధికారుకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమయ్యారు మోదీ.

వీరందరినీ రాజీనామా చేయాలని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్ ర్యాంకుల్లోని అధికారులతో పాటు.. ఇన్‌ కమ్ ట్యాక్స్ డిపార్ట్‌ మెంట్ కమిషనర్‌ ను రాజీనామా చేయాలని ఇప్పటికే ఆర్థిక శాఖ ఆదేశాలు జారీచేసింది.

12 మంది అధికారుల్లో కొందరు అవినీతికి పాల్పడినట్లు, మరికొందరు చట్టాలను అతిక్రమించినట్లు తెలుస్తోంది. ఇంకొందరు అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు, అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు కూడా సీబీఐ విచారణలో బయటడినట్టు సమాచారం.

జాయింట్ కమిషనర్ ర్యాంక్ అధికారి అశోక్ అగర్వాల్, ఐఆర్ఎస్ అధికారి ఎస్‌.కె. శ్రీవాత్సవ, మరో ఐఆర్ఎస్ అధికారి హోమి రాజ్వాంశ్, బీబీ రాజేంద్ర అనే మరో అధికారి వంటి పలువురు ఈ రాజీనామా జాబితాలో ఉన్నారు. వీరందరూ జనరల్ ఫైనాన్షియల్ నిబంధన 56 ప్రకారం రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు.

ఇదే మొద‌టి సారి :
బలవంతపు వసూళ్లు, అవినీతి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వం వీరిపై ఈమేరకు కఠిన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర స్థాయిలో ఇలాంటి అధికారులపై మోదీ ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. ఆర్ధిక శాఖలో పని చేస్తున్న 8 మందిపై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపింది.

వీరిలో చీఫ్ కమిషనర్లు, ప్రిన్సిపల్ కమిషనర్లు, కమిషనర్లు ఉన్నట్టు ప్రభుత్వం ఓ స్టేట్ మెంట్ లో పేర్కొంది. ఐటీ జాయింట్ కమిషనర్ అశోక్ అగర్వాల్ ని 1999 నుంచి 2014 వరకు సస్పెన్షన్ లో ఉంచినట్టు ప్రకటనలో స్పష్టం చేసింది. వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడని, వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు చంద్రస్వామి మీద సీబీఐ విచారణ జరపకుండా అడ్డుపడ్డాడని ఈయనపై ఆరోపణలున్నాయి.

చంద్రస్వామి తన ఆదాయానికి మించి 12 కోట్ల మేర ఆస్తులను సంపాదించాడని అప్పట్లోనే అభియోగాలు వచ్చాయి. అలాగే 1989 బ్యాచ్ కు చెందిన రెవెన్యూ సర్వీసు అధికారి ఎస్.కె. శ్రీవాస్తవ.. ఇద్దరు మహిళా అధికారులను లైంగికంగా వేధించాడట. అవినీతికి, వ్యభిచారానికి పాల్పడాలని వారిని ఒత్తిడి చేశాడని, పన్నులు చెల్లించకుండా ఎగగొట్టాడని ఇతనిపై ఆరోపణలున్నాయి.

ఈ ‘అవినీతి జలగ’ తనపై శాఖాపరమైన విచారణ జరగకుండా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో గత 10 సంవత్సరాల్లో 75 పిటిషన్లు దాఖలు చేశాడట. పైగా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా ఎక్కాడని తెలిసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మాజీ చైర్మన్, సభ్యులపై ఆరోపణలు చేసినందుకు ఇతనికి 15 రోజుల సాధారణ జైలు శిక్ష కూడా పడింది. హోమీ రాజ్ వంశ్ అనే అధికారి అవినీతికి పాల్పడి 3 కోట్ల 17 లక్షల విలువైన ఆస్తులను సంపాదించినట్టు తేలింది. ఇతడిని అరెస్టు చేసి సస్పెండ్ చేశారు.

ఇలా మొత్తం 12 మందిపై కొర‌ఢా :
ఇలా మొత్తం 12 మంది అవినీతి అధికారులపై కేంద్రం కొరఢా ఝలిపించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది అధికారులను ఏకకాలంలో వేటు వేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. నిర్బంద పదవీ విరమణ చేయాల్సిన అధికారులను గుర్తించాలంటూ.. కేబినెట్ సెక్రటేరియట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లు తమ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.

సెంట్రల్ సర్వీసెస్ 1972 చట్టంలోని నిబంధన 56 జే ప్రకారం ఒక అధికారికి 30 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత అతని పనితీరుపై సమీక్ష చేసే అధికారం ఉంటుంది. పనిచేయని అధికారులపై వేటు వేసేందుకు ఉద్దేశించిన విధానాన్ని 2014లో మోదీ అధికారంలోకి రాగానే పునరుద్ధించారు. ఈ మేరకు వీరిపై సమీక్ష నిర్వహించిన సంబంధింత శాఖ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ 12మందిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.

అన్ని శాఖ‌ల అధికారుల‌కు దిశానిర్దేశం:
ఇలా ఓవైపు శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేస్తూనే.. మరోవైపు పాలనను పరుగులు పెట్టించేదిశగా మోదీ అడుగులు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. పేదరిక నిర్మూలనపై ప్రధానంగా దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు.

ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ సూచించారు. గత ఐదేళ్లపాటు అధికారులు శ్రమించి పనిచేయడంతోనే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందన్న మోదీ.. వారిపై ప్రశంసలు గుప్పించారు. ప్రభుత్వ పనితీరుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, సర్కారు పట్ల సానుకూలత వల్లే మళ్లీ అధికారంలోకి రావడం సాధ్యమైందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

About The Author