పుకార్లను నమ్మొద్దు: డీజీపి మహేందర్ రెడ్డి…


హైదరాబాద్: మహిళలు, పిల్లలు అపహరణకు గురౌతున్నారంటూ తెలంగాణలో దుష్ప్రచారం జరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. మిస్సింగ్ కేసులలో చాలావరకు కుటుంబం, ప్రేమ వ్యవహారం, పరీక్షల్లో ఫెయిలవడం, పిల్లలు తల్లిదండ్రులపై అలిగి వెళ్లిపోవడం, కుటుంబ సభ్యుల సంరక్షణ దొరకక తల్లిదండ్రులు వెళ్లిపోవడం వంటి కారణాల వల్ల నమోదౌతున్నాయని తెలిపారు. మిస్సింగ్ కేసులలో 85 శాతానికి పైగా ట్రేస్ చేశామని, మిగతావి ట్రేస్ చేయడానికి పోలీసులు అన్ని యత్నాలూ కొనసాగిస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల భద్రతకు కట్టుబడి అహర్నిశలు పనిచేస్తున్నామన్నారు. ప్రజలలో భయాందోళనలు సృష్టించే విధంగా పుకార్లను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపింప చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో పుకార్లను వ్యాపింప చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహేందర్ రెడ్డి హెచ్చరించారు.
అటు హైదరాబాద్ నగర కమిషనర్ అంజని కుమార్ కూడా సోషల్ మీడియా ఈ విషయంపై స్పందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా రూమర్లు వ్యాపింప చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

About The Author