పెనుమాకలోని వందేమాతరం పాఠశాలలో రాజన్న బడిబాట…


– జనవరి 26న ప్రతి తల్లికి రూ.15వేలు :
– రాజన్న బడిబాటలో సీఎం జగన్

రాష్ట్రంలో విద్యా వ్యవస్ధలో సంపూర్ణమైన మార్పు తీసుకొస్తానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్ధాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపే విధంగా మార్పు తీసుకొస్తామని చెప్పారు.గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో రాజన్న బడిబాట కార్యక్రంలో జగన్ పాల్గొన్నారు. 2వేల మంది పిల్లలతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. పిల్లలను బడికి పంపింనందుకు 2020 జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఓ పండుగలాగా చేసి.. ప్రతి తల్లికి రూ.15 వేలు ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు.2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీలో 33శాతం మంది పిల్లలు చదువుకోలేని పరిస్ధితి ఉందని సీఎం జగన్ వాపోయారు. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్ధను నిర్వీర్యం చేసి దారుణమైన పరిస్ధితికి తీసుకెళ్లాయని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను తుంగలో తొక్కి నారాయణ, చైతన్య పాఠశాలలను పెంచి పోషించారని.. ఈ వ్యవస్ధను మారుస్తానని సీఎం జగన్ చెప్పారు. పాదయాత్రలో భాగంగా ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం పిల్లల చదువు బాధ్యతను చూసుకుంటానని జగన్ తెలిపారు.ఆ మాట నిలబెట్టుకునే రోజు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. పోటీ ప్రపంచంలో మన పిల్లలు కూడా ఎదగాలంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇంగ్లీషు మీడియం స్కూల్ గా మార్చి, తెలుగును తప్పని సరి సబ్జెక్ట్ చేస్తామని సీఎం చెప్పారు. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కావొద్దని.. ప్రతి విద్యార్ధి డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని సీఎం ఆకాంక్షించారు.ప్రయివేటు స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాజన్న బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది స్కూల్‌ ప్రారంభించే నాటికే విద్యార్థులకు సంబంధించి 19.85 లక్షల పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు యూనిఫాం అన్ని పాఠశాలలకు చేరింది.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో భాగంగా విద్యార్థులకు మూడు జతల యూనిఫాం.. 2,51,601 మంది బూట్లు, రెండు జతల సాక్సులు ప్రభుత్వం అందిస్తోంది. 8, 9 తరగతులు చదివే బాలికలకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. పిల్లలతో అక్షరాభ్యాసం చేయించిన తర్వాత విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను సీఎం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author