కోడెల కొడుకుపై మరో కేసు…
కోడెల కొడుకుపై మరో కేసు. కోడెల కె టాక్స్ పుట్టలో మరో పాము. 15 లక్షలు మింగి , నకిలీ అపాయింటుమెంట్ ..
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక క్రీడాకారుడి వద్ద శివరామ్ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేసిన వైనం తాజాగా వెలుగుచూసింది. బాధితుడైన ఆంధ్రా రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజు శుక్రవారం గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. . రెండేళ్ల కిందట విజయవాడకు చెందిన భరత్‌చంద్ర ద్వారా నాగరాజుకు కోడెల శివరామ్ పరిచయమయ్యాడు.
దీన్ని ఆసరాగా చేసుకున్న శివరామ్ స్పోర్ట్స్ కోటాలో రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో గతేడాది ఫిబ్రవరి 27న నరసరావుపేటలోని కోడెల నివాసానికెళ్లి రూ.15 లక్షలను నాగరాజు ఇచ్చాడు. అప్పుడు డబ్బు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్ వెళ్లాలని శివరామ్ చెప్పాడు. అతడు చెప్పినట్టే నాగరాజు ఉద్యోగ నియామక పత్రాలు తీసుకుని మరుసటి రోజు కాన్పూర్ వెళ్లాడు. అక్కడ కోడెల శివరామ్‌కు చెందిన ఓ వ్యక్తి నాగరాజును కలిసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ చేసేటప్పుడు కబురు చేస్తామని నమ్మబలికాడు. దీంతో నాగరాజు తిరిగొచ్చేశాడు.
మే 23న ఎన్నికల ఫలితాల అనంతరం కోడెల కుటుంబం అక్రమంగా వసూళ్లు చేసిన కేట్యాక్స్, ఉద్యోగాలిస్తామని మోసగించిన సంఘటనలపై వరుసగా నమోదవుతున్న కేసుల విషయం తెలుసుకుని తాను కూడా మోసపోయానని నాగరాజు నిర్ధారించుకున్నాడు. కోడెల శివప్రసాదరావుకు ఫోన్లో జరిగిన విషయాన్ని వివరించగా డబ్బులు తిరిగి ఇప్పిస్తానని ఆయన చెప్పడంతో ఈ నెల 2న నాగరాజు నరసరావుపేటలోని కోడెల నివాసానికి వెళ్లాడు. అయితే.. నాగరాజును బెదిరించి కోడెల అనుచరులు బాండ్ పేపరును చించేశారు.