తల్లికి రెండో వివాహం చేసిన కొడుకు…
కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన ఇంజినీర్ గోకుల్ శ్రీధర్ మంగళవారం ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశాడు. రెండో పెళ్లి చేసుకున్న తన తల్లికి ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ’ అంటూ రెండోభర్తతో తన తల్లి ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. రెండో వివాహం నేరంగా భావించే ఈ రోజుల్లో ఈ పోస్ట్ పెట్టేందుకు ఎంతగానో ఆలోచించినట్లు పేర్కొన్నాడు.నా కోసం బాధ భరించావా?
ఈ పోస్ట్ లో గత అనుభవాన్ని తన పోస్ట్ లో పంచుకున్నాడు. ‘‘మా నాన్న ఓ రోజు కొట్టడంతో అమ్మకు తల నుంచి రక్తం కారడం గమనించా. అప్పుడే అడిగా ‘అమ్మా ఎందుకు ఇంకా భరిస్తున్నావ్ ’ అని. అందుకు అమ్మ ఇచ్చిన సమాధానం.. ‘నేను నీ కోసం బతుకుతున్నా.. ఇంకా ఎంతైనా భరిస్తా’ అని చెప్పింది. ఆ తర్వాత తల్లితో కలిసి ఇంట్లోంచి వచ్చేశా. ఆ రోజే అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నా. నా కోసం తన జీవితాన్ని ధారపోసింది. ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ’’ అంటూ ముగించాడు.
గోకుల్ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. 31 వేలకు పైగా లైకులు 3వేలకు పైగా షేర్లు సంపాదించింది. అంతేకాదు గోకుల్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా కామెంట్ల రూపంలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.