‘గన్నవరం’ ఎపిసోడ్ పై స్పందించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ!
చంద్రబాబు ‘గన్నవరం’ ఎపిసోడ్ పై స్పందించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ!
గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు తనిఖీలు
సీఎం, గవర్నర్లకు మాత్రమే డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందన్న కేంద్ర సంస్థ
ఎయిర్ పోర్టులో జెడ్ ప్లస్ వ్యక్తి, ఇతరులు సమానమేనని వ్యాఖ్య
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని గన్నవరం విమానాశ్రయంలో భద్రతాసిబ్బంది తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై టీడీపీ వర్గాలు, అభిమానులు భగ్గుమన్నారు. ఈ ఘటనపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం ముదిరింది.
తాజాగా ఈ వివాదంపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ స్పందించింది.
రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లకు మాత్రమే విమానాశ్రయాల్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తెలిపింది.
మాజీ ముఖ్యమంత్రులకు ఇలా డైరెక్ట్ ఎంట్రీ ఉండదని స్పష్టం చేసింది. విమానాశ్రయాల్లో జడ్ ప్లస్ కేటగిరి వ్యక్తులు, సాధారణ ప్రయాణికుల మధ్య తేడా ఉండదని తేల్చిచెప్పింది.
విమానాశ్రయాల్లో భద్రత అన్నది కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) అధీనంలో ఉంటుందని చెప్పింది.