ఆయుష్షు పెంచే ఔషధం సక్సెస్!
వృద్ధాప్య లక్షణాలను తగ్గించి ఆయుష్షును పెంచే మందుపై జరిగిన తొలి పరీక్ష విజయవంతమైంది. వయసైపోయిన శరీర కణాలను (విభజన జరక్కపోయిన రసాయన సంకేతాలను వెలువరించే కణాలు) నాశనం చేసి బయటకు పంపించడం ద్వారా ఈ మందు పనిచేస్తుందని టెక్సస్ యూనివర్శిటీ శాస్త్రవేత్త నికోలస్ మూసీ తెలిపారు. ఈ కణాలు తొలగిపోతే వయసుతోపాటు వచ్చే వ్యాధులను నివారించవచ్చునని మూసీ అంటున్నారు. గత జనవరిలో తాను 14 మందితో ఒక ప్రయోగం చేశామని, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వీరికి డాసాటినిబ్ (లుకేమియాకు ఇచ్చే మందు), క్వెర్‌సిటిన్ అనే మందులను కలిపి ఇచ్చామని చెప్పారు. కొంత కాలం తరువాత పరీక్షించినప్పుడు వారి ఆరోగ్యంలో ఎంతో మార్పు కనిపించిందని.. ఎక్కువ దూరం నడవగలిగారని తెలిపారు. ఈ ప్రయోగం చాలా పరిమితమైంది ఐనప్పటికీ… మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు. ఈ దిశలోనే తాము 15 మందికి ఊపిరితిత్తుల, 20 మంది కిడ్నీ రోగులకు ఈ మందు ఇస్తున్నామని.. సత్ఫలితాలు వస్తే మరింత విస్తృత స్థాయిలో ప్రయోగాలు చేపడతామని వివరించారు