ఇదే నా చివరి ఫోటో కావచ్చు… అదే నిజమైంది..
ఇదే నా చివరి ఫోటో కావచ్చు… అదే నిజమైంది..
కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారి వాట్సాప్ ..
చనిపోవడానికి కొన్ని గంటల ముందు కేతన్ శర్మ(29) తన ఫోటోను కుటుంబ సభ్యులకు వాట్సాప్ చేశాడు. అంతేకాక బహుశా ఇదే నా లాస్ట్ ఫోటో కావొచ్చు అనే సందేశాన్ని కూడా పంపాడు. అన్నట్లుగానే కొన్ని గంటల వ్యవధిలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అతను మృతి చెందాడు. కేతన్ శర్మ పంపిన చివరి మెసేజ్‌ను తల్చుకుని అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం గురించి కేతన్ శర్మ బావమరిది మాట్లాడుతూ.. ‘కేతన్ నుంచి మాకు మెసేజ్ రాగానే.. చాలా కంగారు పడ్డాం. తనకు కాల్ చేశాం. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో మరుసటి రోజు ఉదయం వెళ్లి ఆర్మీ అధికారులను కలవగా.. వారు సోమవారం అనంత్‌నాగ్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో కేతన్ శర్మ తీవ్రంగా గాయపడి మరణించినట్లు తెలిపారు’ అన్నారు.
అంత్యక్రియల నిమిత్తం కేతన్ మృతదేహాన్ని మీరట్‌కు తరలించారు. వేలాది మంది ప్రజలు కేతన్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలి వచ్చారు. కేతన్ అంకుల్ ఆర్మీలో పని చేస్తుండేవాడు. దాంతో అతను చిన్ననాటి నుంచి కంటోన్మెంట్ ప్రాంతంలోనే పెరిగాడు. ఆర్మీలో చేరాలని చిన్న వయసు నుంచే కలలు కన్నాడు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఆర్మీలో చేరాడు. అతనికి భార్య ఏరా, ఓ కూతురు ఉన్నారు. కేతన్ మరణంతో కుటంబం అంతా శోక సంద్రంలో మునిగి ఉండగా ఇవేం తెలియని అతని చిన్నారి కుమార్తె తోటి పిల్లలతో కలిసి ఆడుకోవటం చూసి ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది.