అది ఉమ్మితే , కోట్లు రాలుతాయి…


ఎంగిలి గ్లాసుతో నీళ్లు కూడా తాగం.. ఎవరైనా ఉమ్మితే చేతనైతే కొడతాం .. లేదంటే తిడతాం .. అయితే ఈ తిమింగలం ఉమ్మితే కోట్లు కుమ్మరిస్తుంది.. నిజం..
ఆ జీవి ఉమ్ము విలువ ఏకంగా కోట్లలో ఉంటుందట. దీన్ని కలిగి ఉండడం నేరం కూడానట. తాజాగా ముంబయిలో దీన్ని కలిగి ఉన్నందుకు ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. ఒక కిలో ఉమ్ముని బహిరంగ మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నిస్తుండగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ దాని విలువ ఎంతో తెలుసా..? అక్షరాలా ఒక కోటి డెబ్భై లక్షలు. అవును మీరు విన్నది నిజమే. వివరాల్లోకి వెళితే..
‘స్పెర్మ్‌ వేల్’ (తిమింగలాల్లో ఒక జాతి) అనే సముద్ర జీవి ఒక రకమైన మైనం లాంటి పదార్థాన్ని నోటి ద్వారా వదులుతుంది. దీన్ని ఆంగ్లంలో యాంబర్‌గ్రిస్‌ అంటారు. ఇది దాని పేగుల్లో ఉత్పత్తి అయ్యే ఒకరకమైన ద్రవ పదార్థం. సాధారణంగా స్పెర్మ్‌ వేల్స్‌ ఉష్ణమండల సముద్రాలలో దీన్ని వదులుతాయి. దీన్ని అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో ఉపయోగిస్తారు. అందుకే దీనికి అంత విలువ. అనుమతులు లేకుండా దీన్ని కలిగి ఉండడం చట్టరీత్యా నేరం.
తాజాగా నాగ్‌పూర్‌కు చెందిన రాహుల్‌ తుపారే(53), అనే వ్యక్తి ఆ యాంబర్‌గ్రిస్‌ను సంపాదించి ముంబయి మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న ఘట్కోపర్‌ ఠాణాకు చెందిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అతన్ని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా తనకు ఆ పదార్థాన్ని అమ్మిన గుజరాత్‌కు చెందిన లలిత్‌ వ్యాస్ అనే వ్యక్తి పేరు వెల్లడించారు. అనంతరం నిపుణులను సంప్రదించి దాన్ని పరీక్షించగా.. అది యాంబర్‌గ్రిస్‌ అని తేలింది. దీన్ని కనుగొనడం చాలా కష్టతరమైన పని అని వారు తెలిపారు. గల్ఫ్‌లో దీనికి బాగా డిమాండ్‌ ఉండడంతో అక్రమంగా అక్కడికి తరలించి విక్రయిస్తుంటారని పేర్కొన్నారు. అయితే ఈ యాంబర్‌గ్రిస్‌ను మండిస్తే ధనవంతులవుతారనే ఒక మూఢనమ్మకం కూడా ప్రజల్లో ఉంది.

About The Author