రక్తపోటు, జాగ్రత్త… లేదంటే అంతే…

సముద్రం పోటెత్తితే అల్లకల్లోలమే. రక్తం పోటెత్తినా అంతే! శరీరమంతా అతలాకుతలమైపోతుంది. కానీ చిత్రమేంటంటే పైకి అంతా మామూలుగానే ఉండటం. అవును.. అధిక రక్తపోటు చాప కింద నీరులా విస్తరిస్తూ, లోలోపలే దాడి చేస్తుంది. నిర్లక్ష్యం చేశామా..? కళ్ల నుంచి కాళ్ల వరకు అన్ని అవయవాలనూ కోలుకోలేని దెబ్బతీస్తుంది. అందుకే ‘నీ సంఖ్యలు తెలుసుకో’ అని ‘ప్రపంచ అధిక రక్తపోటు’ దినం నినదిస్తోంది.

‘బీపీ మా ఇంటా వంటా లేదు’ అని తెగేసి చెప్పేవారు కొందరు. ‘ఆ.. నాకెందుకు వస్తుంది?’ అని భీష్మించేవారు ఇంకొందరు. ‘తలనొప్పేమీ లేదు. నాకెందుకు బీపీ పరీక్ష’ అని అనుకునేవారు మరికొందరు. ‘బీపీ ఉంటేనేం. అదేం చేస్తుంది?’ అని నిర్లక్ష్యం చేసేవారు ఇంకొందరు. ‘మాత్రలు మొదలెడితే జీవితాంతం వేసుకోవాలటగా’ అని భయపడేవారు మరికొందరు. ఇలా అధిక రక్తపోటు (హైబీపీ) మీద మనదగ్గర అపోహలు, అనుమానాలు, భయాలు ఎన్నెన్నో. అందుకే ఇది మనదేశంలో రోజురోజుకీ విజృంభిస్తోంది. పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు మరో నాలుగు అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో తాజాగా బయటపడిన విషయాలే దీనికి నిదర్శనం.
55%- మనదేశంలో అధిక రక్తపోటు గలవారిలో (15-49 ఏళ్ల వాళ్లు) సగానికి పైగా మందికి ఆ సమస్య ఉన్నట్టే తెలియటం లేదు
3/4 – ప్రతి నలుగురిలో ముగ్గురు ఎన్నడూ రక్తపోటు పరీక్షను చేయించుకోనివారే
1/7 – ప్రతి ఏడుగురిలో ఒకరి కన్నా తక్కువ మందే (13%) మందులు వేసుకుంటున్నారు
1/10 – ప్రతి పది మందిలో ఒకరి కన్నా తక్కువ మందిలోనే (8%) రక్తపోటు అదుపులో ఉంటోంది
10.8%- గత ఏడాదిలో సంభవించిన మొత్తం మరణాల్లో 10.8% మరణాలకు అధిక రక్తపోటే కారణం
* ఈ గణాంకాలు చూసైనా కళ్లు తెరవటం మన తక్షణ కర్తవ్యం. రోజురోజుకీ జీవనశైలి వేగంగా మారిపోతుండటం.. కదలకుండా కూచొని చేసే పనులు పెరిగిపోతుండటం.. పనులు, ఉద్యోగాలతో ముడిపడిన ఒత్తిడి ఎక్కువవుతుండటం.. వంటి పరిస్థితుల నేపథ్యంలో హైబీపీపై అవగాహన పెంచుకోవటం అత్యవసరం.

ఏంటీ సమస్య?

రక్తం ప్రవహించేటప్పుడు రక్తనాళాల గోడల మీద పడే బలం లేదా పీడనాన్ని రక్తపోటు అంటారు. దీన్ని రెండు సంఖ్యలతో సూచిస్తారు. మొదటి (పై) సంఖ్యను ‘సిస్టాలిక్‌’ పోటు అంటారు. ఇది గుండె సంకోచించినపుడు రక్తనాళాల గోడల మీద పడే అత్యధిక పీడనం. రెండో (కింది) సంఖ్యను ‘డయాస్టాలిక్‌’ పోటు అంటారు. ఇది గుండె వ్యాకోచించినపుడు రక్తనాళాల గోడల మీద పడే అత్యల్ప పీడనం.
లక్షణాలేవీ ఉండవు

అధిక రక్తపోటు ఉంటే తలనొప్పి, తలతిప్పు వంటివి ఉంటాయని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. అధిక రక్తపోటు ఉన్నా కూడా చాలామందిలో పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. పరీక్ష చేస్తే గానీ రక్తపోటు ఉన్న సంగతీ తెలియదు. కానీ కొందరికి కొన్ని లక్షణాలు కనబడొచ్చు. అయితే ఇవి ఇతరత్రా జబ్బుల్లోనూ ఉండే అవకాశం లేకపోలేదు.
* తీవ్రమైన తలనొప్పి
* నిస్సత్తువ లేదా తికమక
* చూపు సమస్యలు
* ఛాతీలో నొప్పి
* శ్వాస సరిగా తీసుకోలేకపోవటం
* గుండె లయ దెబ్బతినటం
* మూత్రంలో రక్తం పడటం
* ఛాతీలో, మెడలో, చెవుల్లో దిమ్మెతో మోదినట్టు అనిపించటం

About The Author